
జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఆత్మహత్య
మృతుడు నవీన్‌మిట్టల్ పీఏ
చైతన్యపురి: కొత్తపేట ఓల్డ్ విలేజ్‌లో నివసించే జీహెచ్‌ఎంసీ ఉద్యోగి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చైతన్యపురి ఎస్‌ఐ జయరాం కథనం ప్రకారం...కొత్తపేటకు చెందిన జీహెచ్‌ఎంసీ ఉద్యోగి వంగా నగేష్, భాగ్యమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. నగేష్ చనిపోవటంతో అతని ఉద్యోగాన్ని పెద్ద కుమారుడు వంగా నవీన్‌కుమార్ (26)కు ఇచ్చారు. తల్లి భాగ్యమ్మ జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్‌గా, సోదరుడు ప్రవీణ్ కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. చిన్న సోదరుడు అరుణ్ బీటెక్ చదువుతున్నాడు. నవీన్ కొంతకాలంగా జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ దగ్గర పీఏగా విధులు నిర్వహిస్తున్నాడు.
తల్లి, అమ్మమ్మ, చిన్నతమ్ముడు నవీన్‌తో కలిసి ఉంటుండగా... పెద్ద తమ్ముడు ప్రవీణ్ ఇటీవలే ప్రేమవివాహం చేసుకుని వేరే ఉంటున్నాడు. కాగా, బుధవారం ఇంట్లోని వారంతా బయటకు వెళ్లగా.. అమ్మమ్మను టిఫిన్ చేసి రమ్మని నవీన్ బయటకు పంపాడు. తర్వాత బెడ్‌రూంలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్ ఉస్మానియా మార్చురీకి వచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. నవీన్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.