జహీరాబాద్/సంగారెడ్డి జోన్/సంగారెడ్డి క్రైం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకెళ్తున్నారని, కుల వృత్తుల సంక్షేమానికి ఆయన కంకణబద్ధులయ్యారని భారీ నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లాలో మంత్రి సుడిగాలి పర్యటన చేశారు. శనివారం అర్ధరాత్రి వరకు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రికి అక్కడే బస చేసిన ఆయన ఆదివారం ఉదయం సైకిల్‌పై జహీరాబాద్ మున్సిపాలిటీని చుట్టేశారు.
ఉదయం 7 నుంచి 9.30 గంటల వరకు పలు వార్డుల్లో ఏదీ వదిలిపెట్టకుండా కలియతిరిగారు. ప్లాస్టిక్ కవర్లను మున్సిపాలిటీలో పూర్తిగా నిషేధించాలని, ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను విడివిడిగా సేకరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బస్టాండ్ పక్కన ఓ టిఫిన్ సెంటర్ వద్ద ఆగి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌తో కలిసి టీ తాగారు. అనంతరం మోటార్ సైకిల్‌పై తిరుగుతూ హిందూ శ్మశానవాటిక, రైల్వేట్రాక్‌ను సందర్శించారు.
సంగారెడ్డిలో నిర్వహించిన మత్స్యకారుల అవగాహన సదస్సు, బేడ బుడగ జంగం జిల్లా సభలో హరీశ్ మాట్లాడారు. ఈ ఏడాది మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ.1,050 కోట్లను కేటాయించిందన్నారు. నాణ్యమైన చేప పిల్లలను ఉత్పత్తి చేసుకుంటే జిల్లాస్థాయి సంఘానికి రూ.5 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా 80 శాతం, సొసైటీకి 90 శాతం, జిల్లా సంఘానికి వందశాతం సబ్సిడీపై రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. బుడగ జంగాలకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment