మూడు వారాల్లో పునరుద్ధరిస్తాం
♦ జీవోల వెబ్‌సైట్‌పై హైకోర్టుకు సర్కార్ నివేదన
♦ తదుపరి విచారణ ఏప్రిల్ 28కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) పొందుపరిచే వెబ్‌సైట్‌ను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదించింది. దీనిని పరిశీలించిన హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజలందరికీ అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల వెబ్‌సైట్‌ను మూసివేయడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గురువారం విచారణ సందర్భంగా ఐటీశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది నజీబ్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ, వెబ్‌సైట్‌ను మూసివేయలేదని, తాత్కాలికంగా దానిని పక్కనపెట్టామని తెలిపారు. వెబ్‌సైట్‌ను క్రమబద్ధం చేయడానికి అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు తగిన సూచనలు చేశామన్నారు. మరో 3 వారాల్లో వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తామని, గతంలో ఉన్నట్టే అది ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని ఆయన కోర్టుకు నివేదించారు.