‘నూతనం’... కావాలి అభివృద్ధి పథం
గవర్నర్ నరసింహన్ ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: కొత్త ఏడాదిలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు అభివృద్ధి పథంలో మరింత ముందడుగు వేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను మంత్రులు, అధికారులు, ప్రజలు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహన్ మాట్లాడుతూ... రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకొని దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోవాలన్నారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా వ్యవహరించాలన్నారు. ప్రజలు సోదరభావంతో, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని కోరారు.
రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ... అందరికీ అంతా మంచి జరగాలని అభిప్రాయపడ్డారు. తనకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన తెలంగాణ పోలీసులను గవర్నర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. శాంతిభద్రతలను సమర్థంగా అదుపులో ఉంచుతున్నారని కొనియాడారు. ఇదే ఒరవడిని మునుముందు కూడా కొనసాగించాలని సూచించారు. గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కె.మధుసూదనాచారి, ఏపీ శాసనమండలి చైర్మన్ డా.ఎ.చక్రపాణి, తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎమ్మెల్యే జె.గీతారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, ఇంటలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, అడిషనల్ డీజీ సుదీప్‌లక్టాకియా, సీఐడీ ఏడీజీ సత్యనారాయణ్, హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర ఐపీఎస్‌లు పూర్ణచందర్‌రావు, సౌమ్యామిశ్రా, ఎం.కె.సింగ్, రమేష్‌రెడ్డి, ఈష్‌కుమార్, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు ఉన్నారు.