
ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు గ్రేడింగ్
నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు
కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు అక్కర్లేదు
ఉన్నత విద్యామండలి సమావేశంలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిన అవసరంలేదని ఉన్నత విద్యామండలి తేల్చింది. ఇప్పటికే ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని, కాలేజీ లకు గ్రేడింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయిం చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల పరిస్థితి, కొత్త డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాలా.. వద్దా.. అనే అంశాలపై వివిధ వర్సిటీల కాలేజీ డెవలప్‌మెంట్ కౌన్సిళ్ల డీన్లతో ఉన్నత విద్యామండలి బుధవారం సమావేశం నిర్వహించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2013-14 సంవత్సరంలో ఇచ్చిన 300 డిగ్రీ కాలేజీల్లో చాలావరకు తగిన సంఖ్యలో విద్యార్థుల్లేరని డీన్లు పేర్కొన్నారు.
చాలా కాలేజీల్లో 40 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదన్నారు. ఒక్క విద్యార్థి కూడా చేరని కాలేజీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాత కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించారు. ఇందుకోసం కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ, ఫలితాలను పరిశీ లించేందుకు టాస్క్‌ఫోర్స్ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీల ప్రతినిధులతో కూడిన ఆ కమిటీలు కాలేజీలపై ఇచ్చే నివేదికల ఆధారంగా నాణ్యతాప్రమాణాల బట్టి గ్రేడింగ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది.