సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లను మోడల్ పోలీస్ స్టేషన్లుగా తీర్చిదిద్దేందుకు పోలీస్‌శాఖ సిద్ధమవుతోంది. దేశంలోనే రెండో ఉత్తమ మోడల్ పోలీస్ స్టేషన్‌గా కేంద్ర హోంశాఖ నుంచి అవార్డు పొందిన పంజగుట్ట స్టేషన్ తరహాలో అన్ని స్టేషన్లను మార్చాలని భావిస్తోంది. నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌తోపాటు ప్రతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు కృషి చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలోని 640 శాంతిభద్రతల పోలీస్ స్టేషన్లు, అందులోని స్టేషన్ హౌస్ అధికారులకు గుర్తింపు ఉండేలా ఠాణాలకు గ్రేడింగ్ ఇచ్చేందు కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్లు, వాటిలోని సిబ్బంది పనితీరును ఏ నెలకు ఆ నెల పర్యవేక్షించాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ సూచించారు.
ప్రమాణాల ప్రకారం...
స్టేషన్ ఎలా ఉంది.. కేసు నమోదు దగ్గరి నుంచి చార్జిషీట్ వరకు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది.. బాధితులు, ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు.. పెండింగ్ కేసుల క్లియరెన్స్‌కు తీసుకుంటున్న చర్యలేంటి.. ఇలా 40 రకాల ప్రమాణాలను స్టేషన్ల గ్రేడింగ్ కోసం అమలు చేయనున్నారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందిపై ప్రజాభిప్రాయం తెలుసుకునేలా ఫీడ్ బ్యాక్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ పద్ధతిని ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించి సక్సెస్ అయిన స్టేషన్లు, అధికారులకు ప్రతి నెలా గ్రేడింగ్ ఇచ్చి ప్రోత్సాహకాలు అందించనున్నారు.
ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు...
మండలాలు, రూరల్ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ప్రతి గ్రామంలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా కార్యాచరణ రూపొందించాల ని ఉన్నతాధికారులు ఎస్పీలు, కమిషనర్లను ఆదేశించారు. ఇందుకోసం ప్రజాభాగస్వామ్యం కావాలని, దీనిపై సర్పంచులు, ప్రజాప్రతినిధులును కలసి సీసీ కెమెరాల ఏర్పాటు ఆవశ్యకతను వివరించాలన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి కూడా సేకరించినా లేదా వారి ద్వారా ఏర్పాటు చేయించినా ప్రజలకు బాగుంటుందని సలహా ఇచ్చినట్లు తెలిసింది. ప్రతి గ్రామంలోని సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్‌కు, అక్కడి నుంచి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న కమాండ్ సెంటర్‌కు అనుసంధానించేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలిసింది.
పునరుద్ధరణ దిశగా విలేజ్ పోలీస్ ఆఫీసర్...
గ్రామాల్లో ఓ 15 ఏళ్ల క్రితం వరకు విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ అందుబాటులో ఉండేది. గ్రామంలో ఏ గొడవ జరిగినా, సమస్య వచ్చినా ముందుగా విలేజ్ పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న కానిస్టేబుల్ వద్దకు వచ్చేది. ఇప్పుడు మళ్లీ అదే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చి విస్తృతపరచాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. అలాగే గ్రామాల్లో ఉత్సాహవంతులైన యువకులతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేయించి గ్రామ సమస్యలు, పరిష్కారాల విషయంలో వారిని భాగస్వాములను చేసేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment