
పన్ను ‘పోటు’ తప్పదు..!
గ్రేటర్‌లో ఆస్తి పన్ను మదింపునకు చర్యలు
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రకటన
సిటీబ్యూరో: గ్రేటర్‌లో ఆస్తి పన్ను పెరగనుంది. జీహెచ్‌ఎంసీ అధికారులు త్వరలో ఇందుకు సంబంధించిన కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం రూ.1200 లోపు ఆస్తిపన్ను ఉన్నవారికి ప్రభుత్వం మినహాయింపునివ్వడంతో రూ. 101 చెల్లిస్తే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి.. వాణిజ్య భవనాలకు పన్ను పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీలో 2002 తర్వాత ఆస్తిపన్ను సవరణ చేయలేదన్నారు. అలాగే వాణిజ్య భవనాలకు 2007 తర్వాత సవరించలేదని చెప్పారు. ఇకపై ఆస్తిపన్నును ప్రతియేటా లేదా ఐదేళ్లకోసారి పునర్ వ్యవస్థీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఆస్తిపన్ను మదింపులో అవకతవకలకు తావులేకుండా జీఐఎస్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా చేపట్టే అవకాశం ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆస్తిపన్ను నిర్ధారణను కాన్పూర్‌లో విజయవంతంగా అమలు చేశారని ఈ సందర్భంగా తెలిపారు. శాస్త్రీయంగా జరిగే ఆస్తిపన్ను మదింపుతో ప్రస్తుతం రూ. 1200 లోపు పన్ను ఉన్నవారికి సైతం పెరిగే అవకాశముంది. లేదా వీరి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక రాయితీ ఇస్తుందో వేచి చూడాలి.
సర్కిళ్ల సంఖ్య 30కి పెంపు..
ప్రస్తుతమున్న జీహెచ్‌ఎంసీ 24 సర్కిళ్లను 30కి పెంచేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. వంద రోజుల ప్రణాళికలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఈ అంశాన్ని ప్రకటించినందున గడువులోగా వీటి సంఖ్యను పెంచేందుకు అవసరమైన చర్యలు వేగంగా జరగుతున్నాయని చెప్పారు. మోడల్ మార్కెట్ల నిర్మాణం పురోగతిలో ఉందని, రాజేంద్రనగర్ సర్కిల్‌లో ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. మొత్తం రూ. 130 కోట్లతో 200 మార్కెట్లు నిర్మాణం లక్ష్యం కాగా, వీటిల్లో 70 మార్కెట్ల నిర్మాణం రెండు నెల ల్లో పూర్తవుతుందని కమిషనర్ తెలిపారు. ఎస్సార్‌డీపీలో భాగంగా ఫ్లై ఓవర్ల పనులకు సంబంధించి భూసేకరణ సమస్యలు ఉన్నాయని, వీటిని పరిష్కరించేందుకు సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.
త్వరలో ఏఎంఓహెచ్ పోస్టుల భర్తీ..
జీహెచ్‌ఎంసీలో ఖాళీగా ఉన్న ఏఎంఓహెచ్‌ఓ పోస్టులను భర్తీ చేయాల్సిందిగా వైద్య, ఆరోగ్యశాఖకు లేఖ రాశామని ఆయన తెలిపారు. నగరంలో ఆరోగ్య కార్యక్రమాలు చేపట్టేందుకు త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో 15 ఏళ్లకు పైబడి ఉన్న వాహనాలను దశలవారీగా తొలగిస్తామని, 30 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా వేలం వేస్తామని చెప్పారు.
నీటి పొదుపు పాటించండి..
గతంలో ఎప్పుడూ లేని విధంగా నగరానికి తీవ్ర నీటికొరత ఏర్పడే ప్రమాదముందని కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలని కోరారు. కనీసం 30 నుంచి 40 శాతం నీటిని ఆదా చేయాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వెయ్యి ఇంకుడు గుంతల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకొచ్చే కాలనీ, స్వచ్ఛంద సంఘాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్లు సి.రామకృష్ణారావు, జె. శంకరయ్య పాల్గొన్నారు.