
విద్యుత్ వినియోగం పైపైకి..
గ్రేటర్‌లో 47.48 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ వాడకం
మార్చి చివరినాటికి 60 మిలియన్ యూనిట్లకు చేరుకునే అవకాశం
వేసవిలో నిరంతరాయ సరఫరా కోసం ముందస్తు ఏర్పాట్లు
సిటీబ్యూరో: గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం రోజురోజుకు మరింత పెరుగుతోంది. రెండు రోజుల క్రితం సిటీజనులు 47.48 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 40–42 మిలియన్ యూనిట్లు ఉన్న విద్యుత్ వినియోగం..మూడో వారం నాటికి అదనంగా ఐదు మిలియన్ యూనిట్లు పెరిగింది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది వేసవిలో గరిష్టంగా 52–55 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈసారి 60 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉంది. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డిస్కం ఇప్పటికే సర్కిళ్ల వారిగా విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు చేశారు. మార్చి తొలినాటికి పునరుద్ధరణ పనులన్నీ పూర్తి చేసి, ఆ తర్వాత విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని నిర్ణయించారు.
ఒత్తిడి తట్టుకునేలా...
హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ ఈస్ట్, రంగారెడ్డి సౌత్, రంగారెడ్డి నార్త్ సర్కిళ్ల పరిధిలో సుమారు 42 లక్షల విద్యుత్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో 34 లక్షల గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉండగా, మిగిలినవి చిన్న, మధ్య తరహా, భారీ పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. వచ్చే వేసవిలో వీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీర్చాలంటే రోజుకు సగటున 60 మిలియన్ యూనిట్లకుపైగా అవసరం. రాబోయే ఒత్తిడిని తట్టుకుం టూ ఫీడర్లలో ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ మేరకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల పునరుద్ధరణ, లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మల నరికివేత, ఆయిల్ లీకేజీలను అరికట్టడం వంటి పనుల కోసం రూ.25 కోట్లకుపైగా ఖర్చు చేస్తుంది. ఇప్పటికే సగం పనులు కూడా పూర్తి చేసినట్లు డిస్కం అధికారులు స్పష్టం చేశారు. మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తామని చెబుతున్నారు.