గ్రేటర్‌లో ఈ-వేస్ట్ చట్టానికి తూట్లు.. | Greater this - Waste Act tutlu .. | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో ఈ-వేస్ట్ చట్టానికి తూట్లు..

Published Mon, Oct 28 2013 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM

గ్రేటర్‌లో ఈ-వేస్ట్ చట్టానికి తూట్లు..

గ్రేటర్‌లో ఈ-వేస్ట్ చట్టానికి తూట్లు..

సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాన్ని ఈ-వేస్ట్ ముంచెత్తుతోంది. రోగాలకు హేతువైన మూలకాలను విడుదల చేస్తూ పర్యావరణాన్ని కలుషితం చేస్తోంది. కాలుష్య రూపంలో కనబడకుండానే ఆరోగ్యానికి పొగబెడుతోంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల నియంత్రణ, నిర్వహణకు ఉద్దేశించిన ఈ-వేస్ట్ నిర్వహణ చట్టం ‘గ్రేటర్’లో నీరుగారుతోంది. గ్రేటర్ నగరంలో తరచూ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ఈ-వేస్ట్) చెత్తకుండీలు, డంపింగ్ యార్డుల్లో గుట్టలుగా పోగవుతున్నా.. ఇటు జీహెచ్‌ఎంసీ, అటు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రేక్షక పాత్రకే పరిమితమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ విడిభాగాలను పునఃశుద్ధి చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంలో దారుణంగా విఫలమవుతున్నాయి.

చెత్తకుండీల పాలవుతున్న ఈ-వ్యర్థాలు పెనుప్రభావం చూపుతున్నాయి. వీటిని దహనం చేయడం వల్ల విడుదలయ్యే సీసం, క్రోమియం, కాడ్మియం వంటి మూలకాలు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతున్నాయి. కాలుష్య అవధులు శృతి మించితే ఏకంగా క్యాన్సర్ ముప్పు తప్పదంటున్నారు పర్యావరణ వేత్తలు. ఈ వేస్ట్ నిర్వహణ చట్టం నగరంలో అమలు కావట్లేదు. ఫలితం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా సుమారు 4 వేల టన్నుల చెడిపోయిన ఎలక్ట్రానిక్ విడిభాగాల (ఈ-వేస్ట్)కు సంబంధించిన చెత్త ఉత్పత్తవుతోందని పర్యావరణ పరిరక్షణ, శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) లెక్క తేల్చింది. ఇదంతా డంపింగ్ యార్డుల్లో చేరి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. నగరంలో ఈవేస్ట్ సేకరణ కేంద్రాలు మచ్చుకు ఒక్కటైనా లేవు. వీటిని ఏర్పాటు చేయాలన్న ధ్యాస కూడా పీసీబీ, జీహెచ్‌ఎంసీలకు లేకపోవడం శాపంగా పరిణమిస్తోంది.
 
 ఈ-వేస్ట్ ఉత్పత్తిలా..

 మహా నగరంలో సుమారు 70 లక్షల సెల్‌ఫోన్లున్నట్లు ఓ అంచనా. వీటిలో ఏటా సుమారు 25-30 శాతం చెత్తకుండీల పాలవుతున్నాయి. అక్కడి నుంచి డంపింగ్ యార్డుకు చేరుతున్నాయి. యార్డులో వీటిని దహనం చేస్తే వాటిలో ఉండే సీసం, క్రోమియం, కాడ్మియం వంటి మూలకాలు పర్యావరణంలో చేరుతున్నాయి. ఇవి తీవ్రమైన వాయు కాలుష్యానికి కారణమవడంతో పాటు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్‌కు కారణభూతమవుతున్నాయి. ఇక టీవీల్లోని క్యాథోడ్ రేస్ ట్యూబ్‌లు, కంప్యూటర్‌లలోని మదర్‌బోర్డులు, రిఫ్రజిరేటర్ల స్టెబిలైజర్లు, కండెన్సర్‌లలోనూ పై మూలకాల శాతం అధికంగా ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ-వేస్ట్‌ను వృథాగా పడవేస్తే వాటిలోని హానికారక మూలకాలు భూగర్భంలోకి చేరి భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తాయని పీసీబీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
 ఏటా 4 వేల టన్నుల వ్యర్థాలు..

 జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా సుమారు నాలుగువేల టన్నుల ఈ-వ్యర్థాలు పోగుపడుతున్నాయి. వీటిని శాస్త్రీయంగా శుద్ధి జరగడం లేదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ-వ్యర్థాల ఉత్పత్తిలో ఏటా 25 శాతం మేర వృద్ధి నమోదవుతుందని పీసీబీ వర్గాలు ఁసాక్షిరూ.కి తెలిపాయి.
 
 చట్టమెక్కడో..?

 ఈ-వ్యర్థాల నిర్వహణ, సేకరణ కేంద్రాల ఏర్పాటు ఆవశ్యకతను నొక్కిచెబుతూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2012 మేలో ఈ -వ్యర్థాల నిర్వహణ చట్టాన్నిచేసింది. దీని ప్రకారం భారీ స్థాయిలో ఈ-వేస్ట్‌ను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు, జీహెచ్‌ఎంసీ సహకారంతో తప్పనిసరిగా కలెక్షన్ సెంటర్లను సొంతంగా ఏర్పాటు చేయాలి. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర బహిరంగ ప్రదేశాల్లోనూ ఈ కేంద్రాలు అందరికీ తెలిసేలా ఏర్పాటు చేయాలని చట్టం చెబుతోంది. కానీ నగరంలో ఈ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘనకు గురవుతుండడం గమనార్హం.
 
 ప్రేక్షక పాత్రలో పీసీబీ..

 న గరంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు, వాటి ఉత్పత్తి, అందులో వాడుతున్న హానికారక పదార్థాలపై పీసీబీ పర్యవేక్షణ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయరీదారులకు పీసీబీ అనుమతి, పర్యవేక్షణ తప్పనిసరి అన్న నిబంధన లేకపోవడంతో ఆయా కంపెనీల ఉత్పత్తులు నగర పర్యావరణానికి పొగ బెడుతున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఎలక్ట్రానిక్ విడిభాగాలు దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రాల అనుమతి ఉంటే చాలన్న నిబంధన కూడా జీెహ చ్‌ఎంసీ ప్రేక్షక పాత్రకు కారణమవుతోంది.
 
 కొందరికే పర్యావరణ స్పృహ...

 హైటెక్ సిటీగా పేరొందిన మన నగరంలో కొన్ని బహుళజాతి కంపెనీలు మాత్రమే తమ వద్ద నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, మదర్‌బోర్డుల వంటి వాటిని బెంగలూరులోని ఈ-వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిసింది. కానీ వందలాది కంపెనీలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తమ వద్ద పోగుపడిన వ్యర్థాలను చెత్తకుండీల్లో పడవేస్తున్నాయి.
 
 వివిధ దశల్లో పునఃశుద్ధి

 బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ-వేస్ట్‌ను శాస్త్రీయ విధానాల్లో శుద్ధి చేస్తున్నారు. ఆ
 
 ప్రక్రియ ఇలా..

 ఉత్పత్తి అయ్యే చోటనే ఈ-వేస్ట్ కలెక్షన్ కేంద్రాలను నెలకొల్పారు
 
 ఈ-వ్యర్థాల ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడం (రెడ్యూస్), వాటిని శాస్త్రీయంగా శుద్ధి చేయడం(రీసైక్లింగ్), కొన్నింటిని తిరిగి వినియోగించడం (రీయూజ్). ఇలా మూడు పద్ధతుల్లో ఈ వ్యర్థాలను నిర్వహిస్తున్నారు
 
 మదర్‌బోర్డులు, పీసీలు, రిఫ్రజిరేటర్లు, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ విడిభాగాలను వేర్వేరుగా సేకరిస్తున్నారు
 
 వాటిలో ఉండే హానికారక మూలకాలను మొదట తొలగిస్తున్నారు. వీటిని పునఃశుద్ధి కేంద్రానికి తరలించి శాస్త్రీయ విధానాల్లో, నిపుణుల పర్యవేక్షణలోనే రీసైక్లింగ్ చేపడుతున్నారు
 
 కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలను రీసైక్లింగ్ చేసి తిరిగి వినియోగించేలా చేస్తున్నారు
 
 కంప్యూటర్ విడిభాగాలను బెంగలూరులోని ఈ వ్యర్థాల పునఃశుద్ధి కేంద్రం పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో వాటిలోని హానికారక మూలకాలను తొలగిస్తోంది. ఈ విధానం సత్ఫలితాన్నిస్తోందని పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement