సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్ | Sagar partial break again | Sakshi
Sakshi News home page

సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్

Published Thu, Dec 19 2013 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్

సాగర్ ప్రక్షాళనకు మళ్లీ బ్రేక్

=వ్యర్ధాల డంపింగ్‌పై పీసీబీ అభ్యంతరం
 =హెచ్‌ఎండీఏకు తాజాగా నోటీసులు జారీ
 =గుట్టలుగా పేరుకుపోతున్న వెలికి తీసిన వ్యర్థాలు

 
సాక్షి, సిటీబ్యూరో: సాగర్ ప్రక్షాళన ప్రహసనంగా మారింది. ప్రమాణాలు పాటించకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడంపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ప్రక్రియను తక్షణం నిలిపేయాలంటూ హెచ్‌ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇచ్చేందుకు శుక్రవారం (20న) పీసీబీ కార్యాలయానికి రావాలని హెచ్‌ఎండీఏ అధికారులకు సూచిం చింది. ఫలితంగా సాగర్ వ్యర్థాల తరలింపు ప్రక్రియకు మళ్లీ బ్రేక్ పడింది. ఇప్పటివరకు వెలికితీసిన వ్యర్థాలు ప్రస్తుతం సంజీవయ్య పార్కులో గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి.

ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థంకాక అధికారులు జుట్టు పీక్కొంటున్నారు. ఆది నుంచి అడుగడుగునా అవాంతరాలు ఎదుర్కొంటున్న సాగర్ శుధ్ది కార్యక్రమం ఎప్పటికి పూర్తవుతుందనేది సమాధానం లేని ప్రశ్నగా మిగి లింది. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన ప్రాజెక్టులో భాగం గా బంజారా నాలా, బల్కాపూర్ నాలా, పికెట్ నాలా, కూకట్‌పల్లి నాలాల ముఖద్వారం వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు వెలికి తీయాలని హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. తొలిదశలో భాగంగా బంజారా, బల్కాపూర్, పికెట్ నాలా వద్ద 6.5 లక్షల క్యూబిక్ మీటర్ల మేర వ్యర్థాలను తొలగించేందుకు నడుం బిగించింది. తొలుత పికెట్ నాలా వద్ద డ్రెడ్జింగ్ కార్యక్రమాన్ని గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించింది.

సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను జవహర్‌నగర్‌కు తరలించాలనుకొన్నారు. అయితే...  స్థానిక ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం కావడంతో గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీ వెనుక ఉన్న క్వారీలను ఇందుకోసం ఎంపిక చేశారు. అక్కడ కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో శివారులోని గాజులరామారం వద్ద 2.5 ఎకరాల్లోని క్వారీలను డంప్ సైట్‌గా నిర్ణయించారు. ఇందుకు పీసీబీ కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో 4 నెలలగా ఇక్కడి క్వారీల్లోకి సాగర్ వ్యర్థాలను తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20వేల టన్నుల వ్యర్థాలను క్వారీల్లో నింపారు.
 
స్థానికుల కన్నెర్రతో...

డంప్ సైట్‌లో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సాగర్ వ్యర్థాలను క్వారీల్లో నింపుతున్నారంటూ స్థానికులు అభ్యంతరం పెట్టారు. భారీ వర్షాలకు అది కరిగిపోయి సమీపంలోని కుంటలు, జలాశయాల్లోకి చేరుతుందని, పంట భూములు కూడా విషతుల్యం అయ్యే ప్రమాదం ఉందని ఆక్షేపిస్తూ పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ అధికారులు గాజులరామారంలోని డంప్ సైట్‌ను సందర్శించి తాము  నిర్దేశించిన నియమాలు అతిక్రమించినట్టు గుర్తించారు. ‘ఏ మాత్రం జాగ్రత్తలు పాటించకుండా శివారు ప్రాంతంలోని నీటి కుంటలు, భూములను విషతుల్యం చేస్తారా..? పశుపక్ష్యాదులతో పాటు ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యం పట్టదా..? నిర్దేశిత ప్రమాణాలు పాటించకుండా ‘సాగర్’ వ్యర్థాలను క్వారీల్లో డంప్ చేయడం ఎంతవరకు సమంజసం’ అంటూ పీసీబీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.

వాస్తవానికి నిబంధనల ప్రకారం డంప్ సైట్ నుంచి వ్యర్థాలు కిందికి జారిపోకుండా చుట్టూ ‘క్లే లైనింగ్’ ఏర్పాటు చేయడంతో పాటు సైడ్‌వాల్‌కు 90 సెం.మీ.ల మందంతో హెచ్‌డీపీఈ షీట్ లైనర్‌ను వేయాలి. అయితే... హెచ్‌ఎండీఏ అధికారులు క్వారీలో కేవలం 15 సెం.మీ. మందం ఉన్న హెచ్‌డీపీ షీట్‌ను మాత్రమే వేశారు. దీంతో నిర్దేశిత నియమాలను అతిక్రమించారని పీసీబీ ఆక్షేపిస్తూ వ్యర్థాల డంపింగ్‌ను నిలిపివేయాలని హెచ్‌ఎండీఏకు నోటీసులు జారీ చేసింది. ఫలితంగా సాగర్ నుంచి వెలికి తీసిన వ్యర్థాలను గాజులరామారం డంప్ సైట్‌కు తరలించే కార్యక్రమానికి పూర్తిగా బ్రేక్ పడింది. ఇక్కడి నుంచి ఒక్కలారీ వ్యర్థాలను తరలించాలన్నా పీసీబీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో సాగర్ ప్రక్షాళన ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.

అది ఒండ్రు మట్టేనట..

ప్రస్తుతం పికెట్ నాలా వద్ద వెలికి తీసిన వ్యర్థాలు ఒండ్రు మట్టి (సెడిమెంట్) అని, దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదని, కొందరు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని హెచ్‌ఎండీఏ అధికారులు వాదిస్తున్నారు. నిజానికి పంటభూముల్లో ఎరువుగా ఉపయోగపడే ఈ సెడిమెంట్ వల్ల భూములు గాని, నీటికుంటలు గాని విషతుల్యం కావని, ఆ విషయాన్ని పీసీబీయే నిర్ధరించి తమకు అనుమతి ఇచ్చిందంటున్నారు. వాస్తవానికి ఒండ్రుమట్టి నింపే క్వారీ వద్ద లైనింగ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్నది, భూమిలోకి ఇంకకుండా అడుగున బెడ్ వద్ద 90 సెం.మీ. మందంతో లైనర్ ఏర్పాటు చే శామని, సైడ్ వాల్స్‌కు 15 సెం.మీ. మందంతో హెచ్‌డీపీఈ షీట్ ఏర్పాటు చే శామని చెబుతున్నారు. తాము తీసుకున్న జాగ్రత్తలన్నింటినీ వివరిస్తూ పీసీబీకి లేఖ కూడా రాశామని అధికారులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement