
గ్రూప్-2 పరీక్ష తేదీలు మార్పు..
గ్రూపు-2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ మార్పు చేసింది.
హైదరాబాద్: గ్రూపు-2 పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ మార్పు చేసింది. నవంబరు 12, 13 తేదీల్లో పరీక్షలను నిర్వహిస్తామని తాత్కాలిక షెడ్యూలును గతంలోనే ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ.. నవంబరు 12వ తేదీన నిర్వహించాల్సిన రెండు పరీక్షలను 11వ తేదీకి మార్పు చేసింది. 12వ తేదీన నిర్వహించాల్సిన పరీక్షలను 11వ తేదీనాడే నిర్వహిస్తామని, ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.
నవంబరు 12వ తేదీన యూపీఎస్సీ ఇండియన్ ఫారెస్టు సర్వీసు మెయిన్ పరీక్షను నిర్వహిస్తున్నందునా, ఆరోజు నిర్వహిస్తామని ప్రకటించిన గ్రూపు-2 పేపరు-1, పేపరు-2 పరీక్షలను ఒక రోజు ముందు నిర్వహిస్తామని తెలిపారు. 13వ తేదీన మరో రెండు పరీక్షలు (పేపరు-3, పేపరు-4) ఉంటాయని వెల్లడించారు. దీంతోపాటు పరీక్ష సమాయాన్ని కూడా ఖరారు చేసినట్తు తెలిపారు. గ్రూపు-2 కోసం గతంలోనే 5.65 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం మరో లక్ష మందికిపైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈనెల 23వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియనుంది.
ఇదీ తాజా షెడ్యూలు..:
నవంబరు 11న: పేపరు-1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపరు-2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
- నవంబరు 13వ తేదీన: పేపరు-3 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపరు-4 తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.