
గ్రూప్-2 వాయిదా వేయాలి
హైదరాబాద్: నిరుద్యోగులు కదంతొక్కారు. తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్త్తున్న తీరును నిరసిస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వందల మంది విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. బుధవారం ఉదయం అశోక్‌నగర్‌లోని కేంద్ర గ్రంథాలయం నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు భారీ ర్యాలీని చేపట్టారు. అది ఆర్టీసీ క్రాస్‌రోడ్డుకు చేరుకునే సరికి ఉద్రిక్తతకు దారితీసింది. ‘గ్రూప్-2 ఉద్యోగాలను వాయిదా వేయాలని, 439 నుంచి 3,500 వరకు పోస్టులను పెంచాలని, ఇంటర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, కానిస్టేబుల్, ఆర్‌ఆర్‌బీ పరీక్షలను వాయిదా వేయాలంటూ నినాదాలు చేస్తూ వచ్చిన నిరుద్యోగులను చిక్కడపల్లి ఏసీపీ జె.నర్సయ్య నేతృత్వంలోని పోలీసు బృందం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది.
దీంతో పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి నిరుద్యోగులను ఈడ్చుకుంటూ వ్యాన్‌లోకి ఎక్కించి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిం చారు. వీరికి మద్దతుగా వచ్చిన ప్రొఫెసర్ ఐలయ్యను సైతం పోలీసులు ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి ఎక్కించి అరెస్ట్ చేశారు. ఈ ఆందోళనతో సుమారు అరగంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు అజయ్, గోపాల్‌లు మాట్లాడుతూ గ్రూప్-2 పరీక్షలు మూడు నెలల పాటు వాయిదా వేయాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చొరవ తీసుకుని లక్ష ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులే కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు.
ఎంతో మంది విద్యార్థులు పల్లెల నుంచి నగరానికి వచ్చి రూ.వేలల్లో వెచ్చించి కోచింగులు తీసుకుంటున్నారని తెలిపారు. ఆర్‌ఆర్‌బీ, కానిస్టేబుల్ పరీక్షలు ఒకే సమయంలో ఉండటంతో ఆ పరీక్షలు ఎలా రాస్తారని వారు ప్రశ్నించారు. పోటీ పరీక్షలకు కావల్సిన సిలబస్, తెలుగు అకాడమీ, గ్రూప్-2 బుక్స్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో నిరుద్యోగ విద్యార్థుల సంఘ నేతలు క్రాంతి, భీమ్‌రావునాయక్, గణేష్, రవితేజ, కిషన్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.