
సాక్షి, హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా తలపెట్టిన ఉల్పర రిజర్వాయర్‌తో ఒక్క ఎకరం కూడా ముంపు ఉండ దని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తక్కువ ముంపుతో, రైతాంగానికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీ డిజైన్ చేశారని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఇక్కడ జలసౌధలో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు.
ఉల్పర రిజర్వాయర్ నిర్మా ణం వల్ల ముంపునకు గురవుతామనే భయాం దోళనలు అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఈ రిజర్వాయర్ విషయంలో జరుగుతున్న ఊహాగానాలను నమ్మవద్దన్నారు. 3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ కడుతున్నారనే ప్రచారాన్ని మంత్రి ఖండించారు. 0.25 టీఎంసీల సామర్థ్యంతో ఉల్పర రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ రిజర్వాయర్ పరిధిలో దాసరాజుపల్లి ముంపునకు గురవుతుందనే ప్రచారం అబద్ధమన్నారు.
ఈ గ్రామంలో ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాదన్నారు. డిండి చీఫ్ ఇంజనీర్ సునీల్, రెవెన్యూ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను అంచనా వేస్తార న్నారు. ఉల్పర రిజర్వాయర్ కింద రెండు పం టలకు నీళ్లందుతాయని, మత్స్యకారులకు శాశ్వత ఉపాధి లభిస్తుందన్నారు. అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించాలని అచ్చంపేట శాసనసభ్యుడు బాలరాజు మంత్రిని కోరారు. కల్వకుర్తి ప్రాజెక్టు నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో 50 వేల ఎకరా లకు సాగునీరందిస్తున్నామని, లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని హరీశ్ తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ ఈఎన్‌సి. మురళీధర్‌రావు, సీఈ ఎస్.సునీల్ పాల్గొన్నారు.