
ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు
♦ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు
♦ శాసనసభలో అధికారపక్షం తీరుపై ధర్మాన ధ్వజం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో సోమవారం నాటి కార్యక్రమాలన్నీ ఏకపక్షంగా సాగాయని, ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక ఆత్మరక్షణలో పడిం దని, సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా వెనుకాడిం దని అన్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినపుడు విచారణకు సిద్ధపడటం అధికారంలో ఉన్నవారికి కొత్తేమీ కాదని, విచారణ జరిపితే అభివృద్ధి ఆగిపోతుందనే వితండ వాదాన్ని ప్రభుత్వం తెరమీదకు తేవడం విస్మయాన్ని కలిగిస్తోందని అన్నారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌సీపీ అవి శ్వాస తీర్మానం పెట్టలేదని, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని గాడి లో పెట్టాలనే ఈ అస్త్రం ఉపయోగించామన్నారు. తమకు ఓట్లేసిన వారే ప్రజలు, ఓట్లు వేయని వారు అసలు ఈ రాష్ట్ర ప్రజలే కాదనే విధంగా వారి హక్కులను హరించి వివక్షను ప్రదర్శిస్తున్నారన్నారు. అధికారపక్షానికి ధీటుగా ప్రతిపక్షం ఉన్నపుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని కానీ అవినీతి సొమ్ముతో ప్రలోభపెడుతూ అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలని యోచిస్తూ ఉండటం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు. విమర్శలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షంపై మితిమీరిన విధంగా ఎదురుదాడికి దిగడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని ఆయన అన్నారు.