ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు వినియోగించాల్సిందే:కడియం
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ స్కూళ్లల్లో తప్పనిసరి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్య పుస్తకాలను వినియోగించాల్సిందేనని, ఇష్టారాజ్యంగా ప్రైవేటు సంస్థలు ప్రచురించిన పాఠ్య పుస్తకాలను వినియోగించడానికి వీల్లేదని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రాథమిక స్థాయిలోనూ వీటిని వినియోగించేలా చర్యలు చేపడతామన్నారు. సచివాలయంలో శుక్రవారం తెలుగు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ కమిషన్ ఫర్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రైవేటు పాఠశాలలు, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు కడియంతో సమావేశమయ్యారు.
ప్రైవేటు పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కడియం పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్‌తో ప్రైవేటు పాఠశాలల పరిస్థితులపై సమీక్షించారు. మైనారిటీ ఎయిడెడ్ పాఠశాలల్లో సిబ్బంది నియామకాలపై విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలపై ఆస్తిపన్ను ఎక్కువగా విధిస్తున్నారన్న అంశం తమ పరిధిలోనిది కాదని పేర్కొన్నారు. ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే పాఠశాలల కోసం వచ్చే సోమవారం నాటికి ఆన్‌లైన్ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామని, ప్రతి ప్రీపైమరీ స్కూల్ ఆన్‌లైన్‌లో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.