- రోహిత్ ఆత్మహత్య కారకులు వైదొలగాలనే డిమాండ్ తో దీక్షకు దిగిన ఎనిమిది మంది విద్యార్థులు
- నేడు హెచ్ సీయూకు కేజ్రీవాల్, మాయవతి, సురవరం
సాక్షి, హైదరాబాద్: దళిత విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ తమ పదవుల నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎనిమిది మంది రీసెర్చ్ స్కాలర్స్ బుధవారం ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు దీక్షను విరమించబోమని వారు స్పష్టం చేశారు. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్, ఎన్‌ఎస్‌యూఐ, డీఎస్‌యూ, బీఎస్‌ఎఫ్ తదితర విద్యార్ధి సంఘాలకు చెందిన విద్యార్థులు గుమ్మడి ప్రభాకర్, ఉమామహేశ్వర్, వైఖరి, జయారావు, మనోజన్, కృష్ణయ్య, జైలావ్, రమేశ్ ఈ దీక్షకు దిగారు.
మరోవైపు వరుసగా నాలుగోరోజు కూడా సెంట్రల్ వర్సిటీలో ఆందోళనలు కొనసాగాయి. వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె దిష్టిబొమ్మ దహనం చేశారు. నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివే సే దాకా పోరు కొనసాగుతుందని వర్సిటీ సామాజిక న్యాయ సాధన జేఏసీ ప్రకటించింది. రోహిత్ దళితుడేనని రుజువు చేసే ఎస్సీ సర్టిఫికెట్‌ను విద్యార్థులు విడుదల చేశారు. మరోవైపు ‘వెలివాడ’ వద్ద ప్రత్యేక సమాచార విభాగాన్ని (ఇన్ఫర్మేషన్ డెస్క్) ఏర్పాటు చేశారు. వర్సిటీలో గతేడాది ఆగస్టులో మొదలైన వివాదం నుంచి, కమిటీల నివేదికలు, కేంద్రమంత్రుల లేఖలు, విద్యార్థుల బహిష్కరణ, రోహిత్ సూసైడ్ నోట్, తదితర 21 రకాల పత్రాలను అందులో అందుబాటులో ఉంచారు.
నేడు కేజ్రీవాల్, మాయవతి, సురవరం రాక
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం హెచ్‌సీయూకు రానున్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా హెచ్‌సీయూను సందర్శించనున్నారు.
న్యాయం జరిగే వరకు దీక్ష..
‘‘దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికినా కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదు. మతతత్వ వైఖరితోనే దళిత, వామపక్ష విద్యార్థి సంఘాలపై ఎన్‌డీఏ ప్రభుత్వం, దాని అనుబంధ విభాగాలైన ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్ దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే మ మ్మల్ని వర్సిటీ నుంచి వెలివేశారు. వీసీ బీజే పీ తొత్తుగా ఉన్నారు. ఆత్మహత్యతో సంబం దం ఉన్న వారందరూ పదవుల నుంచి వైదొలగాలి. రోహిత్ కుటుంబానికి న్యాయం జరగే వరకు మా దీక్ష కొనసాగుతుంది’’
- బహిష్కరణకు గురైన పరిశోధక విద్యార్థులు శేషన్న, విజయ్, ప్రశాంత్, సుంకన్న