పోలీసులా.. సంఘ్ శక్తులా?
హెచ్‌సీయూలో విద్యార్థులను చితకబాదింది ఎవరు?: అక్బరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ‘వీసీ అప్పారావు రాకను వ్యతిరేకిస్తూ ఈనెల 22న హెచ్‌సీయూలో విద్యార్థులు నిర్వహించిన నిరసనపై పోలీసుల దుశ్చర్యలను ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. విద్యార్థులను అరెస్టు చేసిన తీరు గర్హనీయం. విద్యార్థులు, అధ్యాపక సిబ్బందిని అరెస్టు చేసి చితకబాదింది అసలు పోలీసులా? వర్సిటీ భద్రతా సిబ్బందా? లేక ఖాకీ దుస్తులు వేసుకున్న సంఘ్ పరివార్ శక్తులా? విద్యార్థినులపై పోలీసుల లైంగిక హింస, రేప్ బెదిరింపులపై విచారణ జరపాలి’ అని ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు.
హెచ్‌సీయూ, ఓయూ ఘటనలపై శనివారం హోంమంత్రి నాయిని ప్రకటన తర్వాత జరిగిన చర్చలో అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘విద్యార్థినులు, మహిళా ఉపాధ్యాయులను కొట్టి, లైంగికంగా వేధించిన పోలీసులు వారిని జుట్టుపట్టి లాగి వాహనాల్లో ఎక్కించా రు.విద్యార్థులను వ్యాన్లలో తోసేసి తీవ్రంగా కొ డుతూ పోలీసు స్టేషన్లకు తిప్పారు. అఖిలపక్ష నేతలతో చర్లపల్లి జైలుకు వెళ్లి విద్యార్థులను కలిస్తే నేను చెప్పేది వాస్తవమా కాదా? అన్నది తెలుస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం ఇదేనా?
వీసీ కార్యాలయం నుంచి బయటకు లాగిన పోలీసులు తనను వ్యభిచారిణిలాగా వ్యవహరించవద్దనే అర్థంలో బూతులు తిట్టారని, రేప్ చేస్తామని బెదిరించారని అక్షిత అనే విద్యార్థిని అమ్నెస్టీకి తెలియజేసినట్లు అక్బరుద్దీన్ పేర్కొన్నారు. భరతమాతకు, ఆడబిడ్డలకు, దళితులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. పోలీసుల దాడిలో తీవ్రగాయాల పాలైన విద్యార్థులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మాదిగ విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉదయ్‌భాను చెవిలో రక్తం గడ్డ కట్టిందన్నారు.
వర్సిటీలో ఆహారం, నీళ్లు, విద్యుత్, నిత్యావసరాలను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. అసెంబ్లీలోకి మీడియాకు అనుమతి ఉన్నా హెచ్‌సీయూలో ఎందుకు లేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, ముస్లింల పట్ల సీఎం చిత్తశుద్ధిపై తమకు విశ్వాసం ఉందంటూనే.. పోలీసులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. హెచ్‌సీయూలో ఉద్రిక్తతలకు కారణమైన వీసీ అప్పారావును అరెస్ట్ చేయాలన్నారు. హెచ్‌సీయూపై కేంద్రం, బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని వాడుకుని చెడ్డపేరు తేవడానికి యత్నిస్తు న్నాయని, వారి కుట్రలకు చిక్కవద్దని సీఎంకు సూచించారు. కన్హయ్య హైదరాబాద్ వచ్చేం దుకు అనుమతించినందుకు ప్రభుత్వా న్ని అభినందిస్తున్నానన్నారు. వీసీని రీకాల్ చేయాలని తీర్మానించి కేంద్రానికి పంపాలన్నారు.