'మా ఇంట్లో జరిగింది మామూలు పూజే'
హైదరాబాద్: నగరంలో సంచలనం రేపిన బురిడీ బాబా వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో ద్యాప్తు చేస్తున్నారు. బేగం పేటలోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఓనర్, రియల్టర్ అయిన మధుసూదన్ రెడ్డి ఇంట్లో డబ్బును రెట్టింపు చేస్తానంటూ పూజలు నిర్వహించి రూ.1.33 కోట్లతో పరారైన శివానంద బాబాను గంటల వ్యవధిలోనే పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.. అతనిపై ఐపీసీ 420, 307,379 సెక్షన్ల కింద కేసులు నమోదుచేసి ప్రశ్నిస్తున్నారు. నకిలీ బాబా డ్రైవర్ షాజహాన్ సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. (చదవండి: పరమాన్నం తినిపించి పంగనామం!)
కాగా, మధుసూదన్ రెడ్డి ఇంట్లో క్షుద్రపూజలు జరిగాయన్న వార్తలపై ఆయన కుమారుడు సందేశ్ రెడ్డి స్పందించారు. 'మా ఇంట్లో జరిగింది మామూలు పూజే. ప్రసాదంలో మత్తు మందు కలిపి ఇవ్వడం వల్ల మేమంతా స్పృహ కోల్పోయాం. నకిలీ బాబా శివానందతో గతంలో మా కుటుంబానికి ఎలాంటి సంబంధంలేదు' అని సందేశ్ రెడ్డి మీడియాకు చెప్పారు. (చదవండి: బురిడీ బాబా చిక్కాడు)