రేపు తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
తెలంగాణ, దక్షిణ ఛత్తీస్ గఢ్, విదర్భపై అల్పపీడనం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. రేపు(శనివారం) తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని, ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కోస్తా తీరం వెంబడి గంటకు 45-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలో అన్ని జిల్లాల్లో, ఏపీలో కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు ఈ భారీ వర్షాలతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్ సమస్యలు రెట్టింపయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో కొన్ని ఏరియాలలో గత రెండు రోజులుగా నిద్రపోలేని పరిస్థితులు తలెత్తాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి బాధితులకు సాయం చేస్తూనే, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.