
సిట్ విచారణకు హీరో రవితేజ డ్రైవర్
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న హీరో రవితేజ డ్రైవర్ శ్రీనివాసరావు విచారణ ముగిసింది. ఆయనను సిట్ అధికారులు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీనివాసరావు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో 10.30 గంటలకు సిట్ అధికారులు విచారణ ప్రారంభించారు.
కాగా డ్రగ్స్ దందాలో కీలక నిందితుడైన జీశాన్ నుంచి రవితేజకు, ఆయన సోదరుడు భరత్, డ్రైవర్ శ్రీనివాసరావుకు డ్రగ్స్ అందినట్లుగా అనుమానించిన సిట్ ఆ కోణంలో విచారణ చేసింది. అలాగే డ్రగ్స్ మాఫియా కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జీశాన్‌తో గల సంబంధాలపై శ్రీనివాసరావును సిట్ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
సోమవారం హీరోలు తనీష్, మంగళవారం నందూను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. కాగా ఆగస్ట్ రెండో తేదీతో తొలివిడత సిట్ విచారణ ముగియనుంది. త్వరలో మరికొందరు సినీ నటులకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా రవితేజను కూడా నిన్న సిట్ సుమారు తొమ్మిదిగంటలపాటు విచారణ చేసిన విషయం తెలిసిందే.