
పోటెత్తిన ‘సంక్రాంతి’ ప్రయాణికులు
* కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
* జనరల్ బోగీల్లోనూ తరలిన జనం
* 850 ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ
* లక్షలాదిగా తరలి వెళ్లిన నగరవాసులు
సాక్షి, హైదరాబాద్: ఊరు రమ్మంది. పట్నవాసులు పల్లెబాట పట్టారు. హైదరాబాద్‌లోని బస్సు, రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ప్రయాణికులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీ బుధవారం తారాస్థాయికి చేరుకుంది. లక్షలాది మంది తరలివెళ్లారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బుధవారం ఒక్క రోజే 850 ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 3,500 బస్సులకు ఇవి అదనం. ప్రైవేట్ బస్సుల్లోనూ జనం భారీసంఖ్యలో తరలి వెళ్లారు. మియాపూర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాఫూల్, ఈసీఐఎల్, ఏఎస్‌రావు నగర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, సాగర్‌రింగురోడ్డు తదితర నగర శివారు ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, సొంత వాహనాల్లో ప్రజలు గ్రామాలకు వెళ్లారు. గురు, శుక్ర వారాల్లో పండుగ కావడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వరుస సెలవులు రావడంతో జనం ఊరిబాట పట్టారు.
బుధవారం ఒక్క రోజే వివిధ మార్గాల్లో 10 లక్షల మందికిపైగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లి ఉంటారని ఒక అంచనా. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. స్లీపర్‌క్లాసులో బెర్తు నిర్ధారణ అయినప్పటికీ రద్దీ కారణంగా ఆ సదుపాయాన్ని పొందలేకపోయిన ప్రయాణికులు కొందరైతే, రిజర్వేషన్ బోగీల్లో వెళ్లేందుకు అవకాశం లభించక జనరల్ బోగీల్లోకి ఎక్కి వెళ్లిపోయినవారు మరి కొందరు. మరోవైపు ప్రత్యేకం పేరిట ఆర్టీసీ, పర్వదినం పేరిట ప్రైవేట్ బస్సులు యథావిధిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు నడుపలేని దక్షిణమధ్య రైల్వే నిర్వాకం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
జనసంద్రాలుగా శివార్లు
సంక్రాంతి ప్రయాణం దృష్ట్యా నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్ తదితర బస్‌స్టేషన్ల కంటే నగర శివార్ల నుంచే జనం పెద్దసంఖ్యలో బయలుదేరారు. దీంతో ఎల్‌బీనగర్, కేపీహెచ్‌బీ వంటి ప్రాంతాలు ప్రయాణికులతో జనసముద్రాలను తలపించాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ ఈసారి 2470 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రతి రోజు 100 నుంచి 200 బస్సులు బయలుదేరగా బుధవారం ఒక్క రోజే 850 ప్రత్యేక బస్సులు విజయవాడ, వైజాగ్, అమలాపురం, బెంగళూర్, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూల్ త దితర ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి.