
హే.. వాట్సాప్.. డ్యూడ్!
సోషల్ మీడియా వినియోగంలో మెట్రో నగరాల్లో నాలుగో స్థానంలో హైదరాబాద్
► వాట్సాప్, ఫేస్‌బుక్‌కే హైదరాబాదీల ఓటు
► 50 శాతం మంది వాడేది వీటినే..
► అధిక గంటలు గడిపితే సమస్యలు తప్పవంటున్న నిపుణులు..
సాక్షి, హైదరాబాద్:
సోషల్ మీడియా.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న ట్రెండ్. ఒకవైపు సమాచారాన్ని వేగంగా అందిస్తూ.. మరోవైపు స్నేహితులు, సన్నిహితులతో తమ భావాలను సులువుగా పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఈ సామాజిక మాధ్యమాలు. ఎక్కడెక్కడో ఉన్నవారితో ‘గ్రూపు’లు కట్టిస్తూ.. చిన్ననాటి స్నేహాలను మళ్లీ చిగురింప జేస్తున్నాయి. దీంతో నిద్రలేచింది మొదలు.. మళ్లీ నిద్రకు ఉపక్రమించే వరకూ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లతోనే కుస్తీపడుతున్నారు జనాలు. దీనికి గ్రేటర్ హైదరాబాద్ వాసులు కూడా మినహాయింపు కాదు. వీరు కూడా నిరంతరం సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. అయితే గ్రేటర్ సిటిజన్లు ప్రధానంగా రెండు సైట్లకే అధిక సమయం కేటాయిస్తున్నారట. వాట్సాప్, ఫేస్‌బుక్‌లే ఎక్కువగా మహానగర వాసుల మనసు దోచుకుంటున్నాయట. సోషల్‌మీడియా ట్రెండ్స్ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ సోషల్ మీడియా వినియోగంలో దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాల తీరును పరిశీలిస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. తొలి మూడు స్థానాల్లో బెంగళూరు, ఢిల్లీ, ముంబై మహానగరాలు నిలిచాయని సోషల్ మీడియా ట్రెండ్స్ తెలిపింది. ఐదో స్థానంలో చెన్నై, ఆరో స్థానంలో కోల్‌కతా నిలిచాయి.
40 లక్షల మందికిపైనే..
కోటి జనాభాకు చేరువైన హైదరా బాద్ మహానగరంలో సుమారు 40 లక్షల మంది సామాజిక మాధ్యమాలను వినియో గిస్తున్నట్టు ఈ సర్వే అంచనా వేసింది.
18–35 ఏళ్ల వయసు వారే..
సామాజిక మాధ్యమాల్లో అత్యధిక సమయం గడుపుతున్న సిటిజన్లలో 18–35 ఏళ్ల వయసు వారే అధికంగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. మిగతా వయసుల వారూ ఈ మాధ్యమాలను వినియోగి స్తున్నా.. యువత మాత్రం నిత్య జీవితంలో చోటుచేసుకునే ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకునే విషయంలో ముందున్నారు.
మోతాదు మించితే అనర్థాలే..
నిత్యం రెండు గంటలకంటే అధిక సమయం సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నవారు మానవ సంబంధాలకు దూరమవుతున్నారని ఈ సర్వే తేటతెల్లం చేసింది. రోజుకు అరగంటపాటు సోషల్ సైట్లతో సావాసం చేస్తే ఎలాంటి నష్టాలూ ఉండవని నిపుణులు చెపుతున్నారు. అధిక సమయం సోషల్ సైట్లలో గడిపేవారు కుంగుబాటు, బయటి వ్యక్తులతో కలవక పోవడం, ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడడం వంటి మానసిక అవలక్షణాలతో సతమతమవుతున్నట్లు చెప్పారు.