ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు.
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై హైకోర్టు జారీ చేసిన నోటీసులను అసెంబ్లీ స్పీకర్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు మరోసారి నోటీసులు జారీచేసే ఉద్దేశం లేదని హైకోర్టు స్పష్టం చేసిం ది. ఈ కేసు పూర్వాపరాల ఆధారంగా విచారణ కొనసాగిస్తామని పేర్కొంటూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీ నుంచి ఎమ్మెల్యేలు తలసాని, తీగల, చల్లా ధర్మారెడ్డి; కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, యాదయ్య, కనకయ్య, విఠల్‌రెడ్డి; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మదన్‌లాల్ పార్టీ ఫిరాయించారని... వీరిపై ఫిర్యాదు చేసినా స్పీకర్ పట్టించుకోవడం లేదని పేర్కొంటూ ఆయా పార్టీల నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం స్పీకర్‌కు నోటీసులు జారీ చేసిందని, వాటిని తీసుకునేందుకు ఆయన నిరాకరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరు కోర్టుకు గుర్తుచేశారు.
సాధారణ పౌరులెవరైనా కోర్టు నోటీసులను తిరస్కరిస్తే వారిపై న్యాయస్థానం చర్యలు తీసుకుంటుం దని, ఈ కేసులో అన్నీ తెలిసిన స్పీకరే కోర్టు నోటీసులను తిరస్కరించారని.. ఇది న్యాయపాలనలో జోక్యం చేసుకున్నట్లయిందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... స్పీకర్ తమ నోటీసులను అందుకోవడానికి తిరస్కరిస్తారని ముందే ఊహించామని పేర్కొంది. నోటీసులను స్పీకర్ తిరస్కరించినంత మాత్రా న అది న్యాయపాలనలో జోక్యం చేసుకున్నట్లు కాదని, అటువంటి పదాలు వాడొద్దని ఆ న్యాయవాదికి సూచించింది.
ఇక ముందు ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ధర్మాసనం కోరింది. దీంతో... సాధారణంగా కోర్టు నోటీసులకు స్పీకర్ స్పందించాల్సిన అవసరం లేదని, లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ తన ఆత్మకథలో సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.