మా ఆదేశాలు అమలు చేయడం లేదేం?
ప్రైవేటు, మైనారిటీ వైద్య కళాశాలల్లో పీజీ వైద్య విద్య ఫీజులను భారీగా పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 41 జారీ చేసింది. అదేవిధంగా మెడికల్, డెంటల్ కోర్సుల సీట్ల భర్తీ విషయంలో నిబంధనలను రూపొందిస్తూ ప్రభుత్వం ఈ నెల 9న జీవో 40 ఇచ్చింది. ఈ రెండు జీవోలను సవాలు చేస్తూ ది హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్, ఉస్మానియా జూనియర్ డాక్టర్ల అసోసియేషన్లు ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన ధర్మాసనం, పెంచిన ఫీజుల్లో 50 శాతం చెల్లించాలని విద్యార్థులను ఆదేశించింది. మిగిలిన మొత్తాలకు బాండ్లు తీసుకోవాలని ఆయా కాలేజీలకు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు బాండ్ తీసుకోవడానికి కాలేజీలు నిరాకరిస్తున్నాయంటూ పలువురు విద్యార్థులు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. బాండ్ల స్థానంలో బ్యాంకు గ్యారెంటీ అడుగుతున్నారని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వివరించారు.