ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రసారాల్లో జోక్యం చేసుకోరాదు | high court said no involvement without nitices on broadcastin | Sakshi
Sakshi News home page

ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రసారాల్లో జోక్యం చేసుకోరాదు

Published Fri, Jun 17 2016 2:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రసారాల్లో జోక్యం చేసుకోరాదు - Sakshi

ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రసారాల్లో జోక్యం చేసుకోరాదు

ప్రాథమిక ఆధారాలను బట్టి అభిప్రాయపడిన హైకోర్టు
సాక్షి టీవీ ప్రసారాల నిలుపుదలపై కౌంటర్ దాఖలు చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం..
ప్రసారాల నిలిపివేత విషయంలో నిబంధనలు పాటించలేదన్న ‘సాక్షి’ తరఫు న్యాయవాది
పిటిషన్ విచారణార్హం కాదన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది
తదుపరి విచారణ 21కి వాయిదా

సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ చట్టం 1995లోని సెక్షన్ 19 కింద ఉత్తర్వులు జారీ చేయకుండా సాక్షి టీవీ ప్రసారాల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రాథమిక ఆధారాలనుబట్టి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ టీవీ ప్రసారాలను నిలిపివేయడాన్ని సవాలు చేస్తూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీన్ని న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి గురువారం విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.

 మా అభ్యంతరం ప్రభుత్వంపైనే..
తమ కేసులో ప్రభుత్వం ఆయా జిల్లాల్లోని పోలీసులద్వారా ఎంఎస్‌వోలకు సూచనలు చేసి సాక్షి టీవీ ప్రసారాల్ని నిలుపుదల చేయించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తమ అభ్యంతరం ఎంఎస్‌వోలపై కాదని, వారికి ఆదేశాలిచ్చిన ప్రభుత్వం, పోలీసులపై మాత్రమేనన్నారు. చట్టప్రకారం టీవీ ప్రసారాల నిలిపివేతకు జిల్లా కలెక్టర్ లేదా పోలీస్ కమిషనర్ లేదా కేంద్రం నోటిఫై చేసిన అధికారికి అధికారాలుంటాయని తెలిపారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. టీవీ ప్రసారాల నిలిపివేత విషయంలో ఎటువంటి ఉత్తర్వులివ్వలేదా? అని ప్రశ్నించారు. ఇవ్వలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ఈ వ్యాజ్యం విచారణార్హం కాదని ప్రభుత్వం చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని, ఏబీఎన్ విషయంలో సుప్రీంకోర్టు కేసు పూర్వాపరాల్లోకి వెళ్లి మరీ ప్రసారాల పునరుద్ధరణకు ఆదేశాలు జారీచేసిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాల్లో లోపాల్ని ఎత్తిచూపుతున్నందుకు సాక్షి టీవీ ప్రసారాల్ని నిలిపివేయించారన్నారు. మీడియా స్వేచ్ఛ విషయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులు వెలువరించిందన్న నిరంజన్‌రెడ్డి.. వాటిని న్యాయమూర్తి ముందుంచారు. తమ టీవీ ప్రసారాల విషయంలో జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాన్ని, డీజీపీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరుతున్నామన్నారు. చట్టప్రకారం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండానే ప్రసారాల్ని ఆపేశారని అంటూ.. ఉత్తర్వులు జారీ చేస్తే వాటిని కూడా సవాలు చేస్తామని తెలిపారు.

 పరస్పర విరుద్ధంగా ఉన్నాయి...
ఈ వ్యాజ్యంలో స్పష్టత లోపించిందని ప్రభు త్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ వాదించారు.ఈ వ్యాజ్యం ఏబీఎన్ దాఖలు చేసిన వ్యాజ్యంలాంటిదేనన్నారు. పిటిషన్‌లో ఒకచోట ప్రభుత్వం చేసిందని ఆరోపణలు చేస్తున్నారని, మరోచోట పోలీసులు చేస్తున్నారంటూ పరస్పర విరుద్ధమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. అసలు ఈ వ్యవహారంలో ఏం జరిగిందో అధికారులతో మాట్లాడి తెలుసుకుంటానని చెప్పారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు జారీ చేయకుండా టీవీ ప్రసారాల నిలుపుదల విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు.కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

నోటీసులుగానీ.. ఉత్తర్వులుగానీ ఇవ్వలేదు...
ప్రసారాల నిలిపివేత విషయంలో అటు ప్రభుత్వంగానీ, ఇటు ఎంఎస్‌వోలుగానీ నిబంధనలను పాటించలేదని నిరంజన్‌రెడ్డి నివేదించారు. ముందస్తు నోటీసులుగానీ, నిలిపివేత ఉత్తర్వులుగానీ ఇవ్వలేదని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేష్ జోక్యం చేసుకుంటూ.. అసలు ఈ వ్యాజ్యం విచారణార్హం కాదన్నారు. ఇదేవిధమైన అంశంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని ఇదే హైకోర్టు తేల్చి చెప్పిందంటూ ఆ తీర్పును ప్రస్తావించారు.

ఇందుకు నిరంజన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ.. ఏబీఎన్ ప్రసారాల నిలిపివేత విషయంలో తెలంగాణ ఎంఎస్‌వోలందరూ కలసి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారని వివరించారు. తెలంగాణ ఎమ్మెల్యేల్ని కించపరుస్తూ కథనాలు ప్రసారం చేశారన్న కారణంతో ఏబీఎన్, టీవీ9ల ప్రసారాలను ఎంఎస్‌వోలు నిలిపేశారని, అందులో ప్రభుత్వ ప్రమేయం లేదని తెలిపారు. తమ కేసుకూ, ఏబీఎన్ కేసుకూ సంబంధం లేదన్నారు. ఎంఎస్‌వోలపై ఏబీఎన్ కేసు దాఖలు చేసిందని, తాము ప్రభుత్వంపై దాఖలు చేశామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement