అక్రమంగా ఏడాది సస్పెండ్ చేశారు
ఒక సెషన్ వరకు మాత్రమే సస్పెండ్ చేయాల్సి ఉన్నా, అన్యాయంగా ఏడాదిపాటు ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని హైకోర్టులో న్యాయవాది వాదించారు. వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తన సస్పెన్షన్‌పై దాఖలు చేసిన పిటిషన్ మీద హైకోర్టులో విచారణ బుధవారం ప్రారంభమైంది. ఈ కేసును ఎందుకు విచారణకు స్వీకరించలేదంటూ సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భొసాలే పరిశీలించారు. అనంతరం సీజే ఆదేశాల మేరకు పిటిషన్‌పై హైకోర్టు బెంచి విచారణ ప్రారంభించింది. సెక్షన్ 340 (2) కింద కేవలం ఒక సెషన్ వరకు మాత్రమే సభ్యులను సస్పెండ్ చేసే అధికారం ఉందని రోజా తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. విచారణ సమయంలో రోజా కూడా కోర్టులోనే ఉన్నారు. రోజా సస్పెన్షన్ వ్యవహారమంతా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. సభ్యుడి హక్కులకు భంగం కలిగినపుడు విచారించే అధికారం కోర్టుకు ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేసింది.
అంతకుముందు ఉదయం ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. గతంలో కేసు విచారణ పరిణామాలను హైకోర్టు అడిగి తెలుసుకుంది. హౌస్ మోషన్, లంచ్ మోషన్ పిటిషన్లకు అనుమతి నిరాకరణపై ఆరా తీసింది. రోజా తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. సీజే చాలా క్లుప్తంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజా పిటిషన్ను విచారించాలంటూ సుప్రీం కోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్కు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.