రెండు రోజలపాటు విద్యాసంస్థలకు సెలవు: సీఎం
► హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు
► శుక్ర, శనివారాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన సీఎం
► ఢిల్లీ నుంచి హైదరాబాద్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ సమీక్ష
► లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
► కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజలకు నెంబర్లు తెలిపాలి
► ప్రాణ నష్టం జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నగరంలో అతి భారీ వర్ష సూచనల నేపథ్యంలో శుక్ర, శనివారాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల (పాఠశాలలు, కళాశాలలు సహా)కు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. హైదరాబాద్‌లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నందున అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతున్న విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో పరిస్థితిపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పటికప్పుడు సమీక్షించారు. పురపాలక మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి, మెదక్ జిల్లాల కలెక్టర్లు రఘునందన్‌రావు, రోనాల్డ్ రాస్‌ను అడిగి వరద పరిస్థితిని గురించి తెలుసుకున్నారు.
మున్సిపల్ మంత్రితో పాటు నగరానికి చెందిన మంత్రులు, జీహెచ్‌ఎంసీ యంత్రాంగం, పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి ప్రజలకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. ఎంతటి అసాధారణ పరిస్థితులు ఎదురైనప్పటికీ, ప్రాణనష్టం జరగకుండా చూడాలని కోరారు. లోతట్టు ప్రాంతాలు, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పారు. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. పోలీస్ శాఖలోని వివిధ విభాగాలతో పాటు రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆర్మీ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలను సహాయ చర్యల్లో ఉపయోగించుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.
పరిస్థితి అదుపులో ఉంది..: వర్ష పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని విభాగాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. భారీ వర్ష సూచనలు, సీఎం ఆదేశాల నేపథ్యంలో ఆయనతోపాటు డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ జీహెచ్‌ఎంసీలోని ఎమర్జెన్సీ కంట్రోల్‌రూమ్ నుంచి గురువారం రాత్రి నగరంలోని పరిస్థితులను సమీక్షించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. వరద బాధితులకు ఉచిత భోజనం, వసతులు కల్పించాలని రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు ఆదేశించారు.
లుంబినీ పార్కులో బోటింగ్ రద్దు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం కంటే ఎక్కువ పరిమాణంతో ప్రవహిస్తోంది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా గురువారం సాయంత్రానికి 513.79 మీటర్లకు చేరుకుంది. పైనుంచి నాలుగువేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు కూడా అంతే పరిమాణంలో వదులుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. సాగర్‌లోకి నిండుగా చేరిన నీరు లుంబినీపార్కులోకి ప్రవేశించడంతో పార్కులోకి సందర్శకుల ప్రవేశాన్ని అధికారులు నిలిపేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, లుంబినీ పార్కులకు శుక్ర, శనివారాల్లో సెలవు ప్రకటించారు.
‘ట్రాఫిక్ ’తో ‘సివిల్’ భాగస్వామ్యం కావాలి: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్ తదితర సీనియర్ అధికారులతో సమావేశమై వర్షాల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు ఎఫ్.ఎం.రేడియో, టీవీ స్క్రోలింగ్స్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని ఆదేశించారు. సెల్లార్లలోకి నీళ్లు చేరితే డయల్-100 సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ట్రాఫిక్ జాంను క్లియర్ చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి రెండు మూడు రోజుల పాటు పనిచేయాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలని మహేందర్ రెడ్డి ఆదేశించారు.