కొత్త రాష్ర్టం ఎలా ఉంది?
కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్న రాహుల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, అభివృద్ధిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ టీపీసీసీ నేతలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి కారులో వెళ్తున్న సమయంలో పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ ఏర్పాటులో ఎదురైన ఇబ్బందులను రాహుల్ గుర్తు చేసినట్లు తెలిసింది. కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక పరిస్థితులు ఎలా ఉన్నాయని అడిగినట్లు సమాచారం. కాగా, అవసరమైన వనరులు ఉన్నా అధికారంలో ఉన్న వారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని టీపీసీసీ నేతలు వివరించినట్లు తెలిసింది. హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పరిపాలన, వారి వారసులు ఇప్పుడు ఎక్కడున్నారని రాహుల్ అడిగి తెలుసుకున్నారు.