చెక్ మెమోలివ్వకుండా దరఖాస్తుల తనిఖీ ఎలా?
* యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణలో గందరగోళం
* ప్రిప్రింటెడ్ చెక్ మెమోలు జారీ చేయని సీసీఎల్‌ఏ
* 10లోగా పరిశీలన చేయాలంటున్న జాయింట్ కలెక్టర్లు
సాక్షి, హైదరాబాద్: పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం (యూఎల్సీ) పరిధిలోని ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు జిల్లాల (హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్) నుంచి వచ్చిన సుమారు ఆరువేల దరఖాస్తులను పరిశీలించేందుకు రెవెన్యూ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.
యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను 90 రోజుల్లోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న ఉన్నతాధికారులు.. సదరు పరిశీలనకు అవసరమైన చెక్ మెమోను మాత్రం 45 రోజులు గడిచినా నేటికీ జారీ చేయలేదు. ఒకవైపు సీసీఎల్‌ఏ కార్యాలయం నుంచి రావాల్సిన ప్రిప్రింటెడ్ చెక్ మెమో రాకుండానే.. మరోవైపు జిల్లాల్లో దరఖాస్తుల పరిశీలన ఈ నెల 10లోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లినపుడు దరఖాస్తులోని పేరు, తండ్రి పేరు, చిరునామా, ఆధార్ నంబరు, స్థలం పొడవు, వెడల్పు.. తదితర వివరాలను తనిఖీ అనంతరం ప్రిప్రింటెడ్ చెక్ మెమోలోని వివరాలతో సరి చూడాలి.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చెక్ మెమో అందకపోవడంతో ఒకే పనిని రెండు సార్లు చేయాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు. సదరు స్థలానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలనూ చెక్ మెమోలో పేర్కొనాలని ఉన్నతాధికారులు ఆదేశించడం మరింత ఇబ్బందికరంగా తయారైంది. మండలాల్లో ద రఖాస్తుల పరిశీలనకు సర్వేయర్ల కొరత ఉండటం, ప్రిప్రింటెడ్ చెక్ మెమో అందకపోవడంతో పరిశీలన చేయడం ఎలాగంటూ తహసీల్దార్లు తల పట్టుకుంటున్నారు.
క్రమబద్ధీకరణకు ఆరువేల దరఖాస్తులు: యూఎల్సీ భూములున్న ప్రాంతాల నుంచి సుమారు ఆరువేల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 5,600 దరఖాస్తులు రాగా, హైదరాబాద్ జిల్లాలో 300, వరంగల్ జిల్లా నుంచి సుమారు వంద దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది. దరఖాస్తు గడువు గత నెల 25తో ముగిసింది. చివర్లో ఆధార్ నుంచి మినహాయింపు ఇచ్చినా ఆ సమాచారం ఎక్కువమందికి చేరలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం ఇవ్వాలంటూ లబ్ధిదారులు జిల్లా కలెక్టర్లకు మొర పెట్టుకుంటున్నారు. కాగా యూఎల్సీ మిగులు భూముల ను డిక్లరెంట్ ద్వారా కొనుగోలు చేసిన పలువురు గ త ఎనిమిదేళ్లుగా స్థలాల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి.