
నయీం ఇంటి నుంచి డబ్బుల బ్యాగులు తీసుకెళుతున్న పోలీసులు
పోలీసుల తనిఖీల్లో వెలుగు చూస్తున్న గ్యాంగ్ ఆగడాలు
సాక్షి, హైదరాబాద్: నయీమ్ ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పోలీసు ఎన్‌కౌంటర్‌లో నయీమ్ ఖతమైన విషయం తెలిసిందే. అనంతరం అతడి నివాసాలతోపాటు అనుచరుల ఇళ్లల్లో రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కట్టల కొద్దీ డబ్బు.. పెద్ద ఎత్తున ల్యాండ్ డాక్యుమెంట్లు బయటపడుతున్నాయి. వాటి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
ఇప్పటి వరకు వెలుగు చూసిన అక్రమాలు..
* షాద్‌నగర్ మిలీనియం కాలనీలోని నయీమ్ స్థావరాల్లో జరిపిన తనిఖీల్లో నాలుగు రివాల్వర్లు, ఒక స్టెన్‌గన్, రెండు ఏకే 47 రైఫిళ్లు, వాటి బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి లభ్యమయ్యాయి. 17 సెల్‌ఫోన్లు, మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు, హోండా అమేజ్ కారు, స్కూటీ, రూ.3.74 లక్షల నగదు, ఐదున్నర తులాల బంగారు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలకు సంబంధించి 121 డాక్యుమెంట్లు లభించాయి. నయీమ్ భార్య హసీనాబేగంతోపాటు భువనగిరిలోని ఖాజామహల్లాకు చెందిన సలీమా బేగం, మిర్యాలగూడలోని అశోక్ నగర్‌కు చెందిన అబ్దుల్ మతీన్.. అతని భార్య ఖలీమా మతీన్‌లను అరెస్టు చేసి షాద్‌నగర్ పీఎస్‌లలో కేసులు నమోదు చేశారు.
* నల్లగొండలోని చైతన్యపురి కాలనీలో నయీమ్ దగ్గరి బంధువు అస్మత్ తజాముల్ అరా ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఒక దేశవాళీ రివాల్వర్, ఐదు చెక్‌బుక్‌లు, ఆరు పాస్ పుస్తకాలు, భూములకు సంబంధించి 36 జిరాక్స్ డాక్యుమెంట్లు, ఐదు ఒరిజినల్ డాక్యుమెంట్లు, నాలుగు ప్రామిసరీ నోట్లు, 19 తులాలకు సంబంధించిన 8 గోల్డ్‌లోన్ డాక్యుమెంట్లు, 20 సెల్‌ఫోన్లు, తల్వార్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ హార్డు డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ పీఎస్ పరిధిలో కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.
* భువనగిరి ఎంపీపీ తోటకూరి వెంకటేశం స్వగ్రామం పగిడిపల్లిలో జరిపిన తనిఖీల్లో ఒక దేశవాళీ తపంచాతోపాటు నాలుగు రౌండ్ల బులెట్లు, ల్యాండ్ డాక్యుమెంట్, టైటిల్‌డీడ్, పాస్‌పుస్తకం స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.
* భువనగిరికి చెందిన 27వ వార్డు కౌన్సిలర్ ఎండీ నాజర్ నివాసంలో దేశవాళీ తపంచా, నాలుగు రౌండ్ల బుల్లెట్లు, రూ.77,500 నగదు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.
* వలిగొండ మండలం కాసిరెడ్డి గూడెంలోని కోనపురి శంకర్, కోనపురి శ్రీశైలం, దండు వెంకటయ్య నివాసాల్లో దేశవాళీ తపంచా, ఆరు రౌండ్ల బుల్లెట్లు, హాండ్ గ్రెనేడ్, డిటోనేటర్లు రెండు, రూ.5.50 లక్షల నగదు, మూడు సెల్‌ఫోన్లు, భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకొని వారిని అరెస్టు చేశారు.
* హాలియా మండలం నాయుడుపాలెంలో రౌడీ షీటర్ గుమ్మడవెల్లి శ్రీను అలియాస్ టమాట శ్రీను నివాసంలో తపంచా, తొమ్మిది భూ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు, 6 పాస్ పుస్తకాలు, నాలుగు ప్రామిసరీ నోట్లు, రెండు ఒరిజినల్ ఒప్పంద పత్రాలు, 12 ల్యాండ్ పట్టా సర్టిఫికెట్లు, ఒక ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకోగా.. నిందితుడు పరారీలో ఉన్నాడు.
* మాన్యం చెల్కకు చెందిన రౌడీ షీటర్ షేక్ జహంగీర్ నివాసంలో ఒక తల్వార్, 13 ప్రామిసరీ నోట్లు, మూడు సెల్‌ఫోన్లు దొరకగా నిందితుడు పరారీలో ఉన్నాడు.
* ఈదులగూడకు చెందిన సయ్యద్ ఫర్జానా, సయ్యద్ సాధిక్, సుల్తానా నివాసాల్లో 240 ల్యాండ్ డాక్యుమెంట్లు, 72 ఫోన్లు, 2 తులాల పుస్తెలతాడు, 4 జతల చెవిదుద్దులు, మూడు వరసల చంద్రహారంతో పాటు ఒక దేశవాళీ రివాల్వర్, నాలుగు డిటోనేటర్లు, 4.05 లక్షల నగదు, స్విఫ్ట్ కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.
* రంగారెడ్డి జిల్లా నెక్నాంపూర్ పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్ 105 ప్లాట్‌లో రెవెన్యూ అధికారులతో కలసి పోలీసులు సంయుక్త తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ప్రకాశ్‌నగర్ చెందిన ఫర్హానాతోపాటు నయీమ్ డ్రైవర్ భార్య అఫ్సాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు పిస్తోళ్లు, ఒక డమ్మీ రివాల్వర్, 227 రౌండ్ల బులెట్లు, ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, మూడు వేట కొడవళ్లు, రెండు గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2.08 కోట్ల నగదు, 1.09 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్‌ఫోన్లు, 10 జెలిటిన్ స్టిక్స్, ఒక ఆడి కారు, రెండు మోటారు సైకిళ్లు, మూడు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 203 ఒరిజినల్ రిజిస్టర్ డాక్యుమెంట్లు, పాసు పుస్తకాలు స్వాధీనం చేసుకొని ఇద్దరిని అరెస్టు చేశారు. మరో తొమ్మిది మంది పిల్లలను గుర్తించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
* నయీమ్ సమీప బంధువు ఫయీమ్‌కు డ్రైవర్‌గా పనిచేసిన రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్‌కు చెందిన నీల శ్రీధర్‌గౌడ్‌తోపాటు సరూర్‌నగర్ హరిపురి కాలనీకి చెందిన నయీమ్ అనుచరుడు పున్నా బలరాం నివాసాల్లో జరిపిన తనిఖీల్లో రూ.35.50 లక్షల నగదు, మూడు పిస్టోళ్లు, 25 రౌండ్ల బుల్లెట్లు, 30 ల్యాండ్ డాక్యుమెంట్లు, సీపీయూ, బ్యాంకు పుస్తకాలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.