నగరంలోని రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో నోట్ల మార్పిడి పేరిట ఘరానా మోసం వెలుగుచూసింది.
బంగారం వ్యాపారి నోట్ల మార్పిడికి యత్నిస్తుండగా ఘటన
హైదరాబాద్: పాత నోట్లను మార్పిడి చేసుకోవడానికి వచ్చిన ఓ బంగారం వ్యాపారిని పోలీసు దుస్తుల్లో ఉన్న దుండగులు బెదిరించి రూ.50 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన బుధవారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన దీపక్(35) బంగారం వ్యాపారి. నగరంలోని తన స్నేహితుడి సహాయంతో అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంక్‌లో పాత నోట్లను మార్చాలనుకున్నాడు. ఈ మేరకు మగంళవారం పాయంత్రం దీపక్ ఓ కారులో తన స్నేహితులైన రమేశ్, దినేశ్, రాజేశ్‌లతో కలసి అత్తాపూర్ ఐసీఐసీఐ బ్యాంక్ వద్దకు వచ్చాడు.
కానీ నోట్లను మార్పిడి చేసే శ్రీనివాస్, చైతన్య, శివకుమార్‌లు ఆలస్యంగా రావడంతో బ్యాంక్ సమయం ముగిసిపోయింది. మరునాడు మళ్లీ వద్దామని భావించిన దీపక్ తన స్నేహితులతో కలసి హైదర్‌గూడ సోమిరెడ్డినగర్‌కు చేరుకున్నాడు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో పోలీస్ వాహనాల హడావిడి కనిపించడంతో భయపడి అక్కడి నుంచి కారులో వెళ్లిపోతుండగా ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. దుండగుల్లో ఒకరు పోలీసు యూనిఫారం, మరో వ్యక్తి సివిల్ డ్రెస్‌లో ఉన్నారు. కారును తనీఖి చేయాలని గద్దించడంతో దీపక్ తన వద్ద రూ.50 లక్షలు ఉన్నాయని, వాటిని బ్యాంకులో మార్పిడి చేయడం కోసం తెచ్చానని చెప్పాడు. ఇది నల్లడబ్బని, 200 శాతం ఫైన్ పడుతుందని, ఇదంతా పత్రికల్లో, టీవీల్లో వస్తుందని దుండగులు భయపెట్టి రూ.50 లక్షల మూటను ఎత్తుకెళ్లారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు రాత్రి 9:30 గటంలకు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.