మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం.. | human library in hyderabad | Sakshi
Sakshi News home page

మాట్లాడే నేస్తం..మానవ పుస్తకం..

Published Fri, Feb 9 2018 8:22 AM | Last Updated on Tue, Sep 4 2018 5:37 PM

human library in hyderabad - Sakshi

అక్కడ పుస్తకాలు మాట్లాడతాయి.. తమలోని సారాన్ని వినిపిస్తాయి.. విశేషాలను వివరిస్తాయి.. జ్ఞానాన్ని అందిస్తాయి.. జీవిత గాథలను కళ్లకు కడతాయి.. సందేహాలను నివృత్తి చేస్తాయి.. అవే మానవ పుస్తకాలు. కొత్తగా ఉంది కదూ! అవును.. నగరంలో నయాట్రెండీ హ్యూమన్‌ లైబ్రరీ. ఈ లైబ్రరీ సిటీలో సంచరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, పాఠకుల చెంతకే వచ్చేస్తోంది. మరో ప్రదర్శనకు సిద్ధమవుతోన్న ‘హ్యూమన్‌ లైబ్రరీ’పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 

సాక్షి, సిటీబ్యూరో: ప్రతి ఒక్కరికీ కొన్ని పరిధులు, పరిమితులు ఉంటాయి. తమకు తెలిసినవే నిజమని భావిస్తారు. వాస్తవాలను  తెలుసుకోవాలనే ఆసక్తి కూడా ఉండదు. ఒక దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బాధను, జీవితాన్ని  అర్థం చేసుకోవడంలో అందరికీ ఒకే విధమైన అభిప్రాయాలు ఉండకపోవచ్చు. సమాజంలో ‘గే’లుగా  ముద్రపడిన వ్యక్తులపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అలాగే సరిహద్దుల్లో జరిగే యుద్ధాల వాస్తవిక విశేషాలు  అందరికీ తెలియకపోవచ్చు. గృహహింసను ఎదుర్కొనే మహిళ సమస్యలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది వ్యక్తుల విజయగాథలు ఎంతో ఆసక్తిగా, స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇలాంటి అనేక రకాల విశేషాలను పుస్తకాల్లో చదివి తెలుసుకుంటాం. కానీ... ఆ వ్యక్తులే స్వయంగా తమ గురించి వివరిస్తే, అదే ‘హ్యూమన్‌ బుక్‌’ కాన్సెప్ట్‌.  

100కు పైగా మానవ పుస్తకాలు..  
ఇది మొట్టమొదట డెన్మార్క్‌లో మొదలైంది. రొన్నీ
అబేర్గల్‌ ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జాతి, కులం, మతం, ప్రాంతం, వివక్ష, లైంగికహింస, హ్యూమన్‌ ట్రాఫికింగ్, లైఫ్‌స్టైల్, ఊబకాయం తదితర అనేక  అంశాలతో ‘హ్యూమన్‌ లైబ్రరీ’ ఆవిర్భవించింది. గతేడాది మార్చిలో హర్షద్, ఆయన మిత్రులు నగరంలో ‘హ్యూమన్‌ లైబ్రరీ’ ఏర్పాటు చేశారు. ఈ లైబ్రరీలో ప్రస్తుతం 100కు పైగా ‘హ్యూమన్‌ బుక్స్‌ (మానవ పుస్తకాలు)’ ఉన్నాయి. వివిధ అంశాలపై స్వచ్ఛందంగా మాట్లాడేవాళ్లను, తమ గురించి తాము చెప్పుకునే ఆసక్తి ఉన్నవాళ్లను సోషల్‌ మీడియా వేదికగా ఒక్క దగ్గరికి చేర్చారు. అలా ఏర్పడిన ఈ హ్యూమన్‌ లైబ్రరీ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తోంది. లామకాన్, స్టేట్‌ ఆర్ట్‌ గ్యాలరీ, బ్రిటీష్‌ లైబ్రరీ తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిగాయి. తాజాగా స్కూళ్లు, కాలేజీల్లోనూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు.

విభిన్నం.. వైవిధ్యం  
నగరంలో నిర్వహించే ‘హ్యూమన్‌ బుక్స్‌ ఎగ్జిబిషన్‌’లో వైవిధ్యమైన అంశాలు ఉంటాయి. ఒక
అంతర్జాతీయ యాత్రికుడు ఇండో–ఆఫ్రికన్‌ సంబంధాల గురించి మాట్లాడతాడు. బ్రాహ్మణుడు ఉర్దూలో అనర్గళమైన ప్రసంగం చేస్తాడు. ఈ విభిన్న అంశాలకు తగినట్లుగానే పుస్తకాలకు శీర్షికలు పెట్టారు. బీయింగ్‌ ఏ డక్, బ్రేక్‌ ది సైలెన్స్‌ ఆన్‌ చైల్డ్‌ సెక్సువల్‌ హరాజ్‌మెంట్, ది సొజోర్నర్, డెఫ్‌ అండ్‌ మ్యూట్, ఓవర్‌కమింగ్‌ ఒబేసిటీ, వండర్‌ ఉమన్, యంగ్‌ పొలిటీషియన్, హోప్‌ అండ్‌ హ్యాపీనెస్, ది ప్రైజ్‌ ఆఫ్‌ స్మైలింగ్‌ తదితర ఉన్నాయి.  

‘హ్యూమన్‌ లైబ్రరీ’ ప్రతినిధులు

ఈ నెల 11న ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు హోటల్‌ గ్రీన్‌పార్కులో ‘ఔట్‌ ఆఫ్‌ ది బాక్స్‌’ హాల్‌లో  హ్యూమన్‌ బుక్స్‌ ప్రదర్శన నిర్వహించనున్నారు. పాఠకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకొనే విధంగా ఇక్కడ కేటలాగ్‌ ఉంటుంది. ఎంపిక చేసుకున్న అంశంపై 30 నిమిషాలు హ్యూమన్‌ బుక్‌ (మనిషి) మాట్లాడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement