వందల సంఖ్యలో బోరుబావుల గుంతలు
- బోరు విఫలమైతే పూడ్చని యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకులు
- ఆడుకుంటూ గుంతల్లో పడి బలవుతున్న చిన్నారులు
- అమలుకాని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం
సాక్షి, హైదరాబాద్: ఊరూరా రాకాసి బోర్లు నోళ్లు తెరుచుకుని ఉన్నాయి. అభం శుభం తెలియని చిన్నారులను బలిగొంటూనే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో తరచూ బోరుబావుల్లో చిన్నారులు పడి మృత్యువాత పడుతున్నా.. ప్రభుత్వాలు, అధికారుల్లో అదే బాధ్యతా రాహిత్యం, నిర్లక్ష్యం కనిపిస్తున్నాయి. బోరు యజమానులు, బోర్‌వెల్స్ నిర్వాహకుల నిర్లిప్తత చిన్నారులకు పెను గండంగా మారింది. బోర్ల తవ్వకం, గుంతల నిర్వహణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం వంటివి ఏ మాత్రం అమలుకావడం లేదు.
వేల సంఖ్యలో బోర్లు..
తాగునీరు, సాగునీటి అవసరాల కోసం ఏటా వేల సంఖ్యలో విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు జరుగుతున్నాయి. అందులో పెద్ద సంఖ్యలో బోర్లు నీళ్లు పడక విఫలమవుతు న్నాయి. ఇలా విఫలమైనవాటిని వెంటనే పూడ్చివేయకుండా.. భూయజమానులు, బోర్ వెల్స్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఏదో బండరాళ్లు పెట్టడం, ఇసుక బస్తాలు కప్పి వదిలేయడం చేస్తున్నారు. కొద్దిరోజులకే ఇసుక బస్తాలు చిరిగిపోవడం, ఎవరైనా బండరాళ్లు పక్కకు జరపడంతో.. బోరు గుంతలు రాకాసి నోళ్లు తెరుచుకుంటున్నాయి. ఆడుకుంటూ వచ్చిన చిన్నారులు వాటిలో జారిపడు తున్నారు. గంటలు, రోజుల తరబడి మృత్యు వేదనను అనుభవిస్తున్నారు. ఎంతో శ్రమించి బోరుబావులకి సమాంతరంగా తవ్వకాలు జరిపినా చిన్నారులు ప్రాణాలతో బయటపడడం లేదు. బోరు గుంతలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు ఎక్కడా అమలు కావడం లేదు. విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు జరపకుండా వాల్టా చట్టంలో పేర్కొన్న నిబంధనలూ కాగితాలకే పరిమితమయ్యాయి.
బతికి బయటపడడం కష్టమే!
► 2012 డిసెంబర్ 8న కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం పల్లెకుంటలో అజిత్ (5) అనే బాలుడు ఇంటిపక్కన ఉన్న పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడి 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయాడు. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపినా.. బాలుడి మృతదేహమే లభించింది.
► 2014 అక్టోబర్ 10న రంగారెడ్డి జిల్లా మంచాల సమీపంలో గిరిజ (5) అనే బాలిక బోరుబావిలో పడి 45 అడుగుల లోతులో ఇరుక్కుపోయింది. మూడు రోజుల పాటు శ్రమించి సమాంతరంగా బావి తవ్వారు. బాలిక అప్పటికే మృతి చెందడంతో సగం మృతదేహాన్ని మాత్రమే బయటకు తీయగలిగారు.
► 2015 మార్చి 8న నల్లగొండ జిల్లా పులిచెర్లలో బాలగోని నర్సింహగౌడ్ కుమారుడు శివ (3) తన తాతకు చెందిన పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. మూడు గంటల పాటు శ్రమించి గుంత తవ్వినా కాపాడలేకపోయారు.
► 2015 నవంబర్ 28న మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో రాకేశ్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ 60 అడుగుల లోతున్న బోరుబావిలో జారిపడ్డాడు. 24 గంటల పాటు శ్రమించి గుంతను తవ్వినా.. అప్పటికే మృతి చెందాడు.
► 2016 డిసెంబర్ 7న నెల్లూరు జిల్లా కావలి మండలం నందెమ్మపురంలో మౌనిక(2) తమ ఇంటి ముందు తవ్విన బోరుబావి లోనే పడిపోయింది. ఆమెను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
మృత్యుంజయులు కొందరే!
► మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం ముదిరెడ్డిపల్లి గ్రామంలో నందిని అలియాస్ అంజలి (6) అనే బాలిక బోరుబావిలో పడినా ప్రాణాలతో బయటపడింది. నీరు పడలేదని బోరుబావిని పూడ్చేసినా దాదాపు 10 అడుగుల మేరకు వదిలేశారు. లోతు తక్కువగా ఉండడంతో బాలిక సురక్షితంగా బయట పడింది. రెండు గంటల పాటు తవ్వకాలు జరిపి బాలికను సురక్షితంగా బయటకు తీశారు.
► మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం బింగదొడ్డి గ్రామానికి చెందిన తిరుమలేశ్ అనే ఏడాదిన్నర బాలుడు 2011 డిసెంబర్ 7న బోరుబావిలో పడిపోయాడు. బోరుబావికి సమాంతరంగా బావి తవ్వి 20 అడుగుల లోతు నుంచి తిరుమలేశ్‌ను సురక్షితంగా తీశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలివీ..
► బోరు వేయడానికి 15 రోజుల ముందు భూ యజమాని సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలి.
► బోరు చుట్టూ కంచె లేదా తగిన రీతిలో రక్షణ ఏర్పాట్లు చేయాలి.
► బోరు రంధ్రం చుట్టూ అర మీటరు పొడవు, అర మీటరు వెడల్పు, భూమిలో 0.3 మీటర్ల లోతు, భూఉపరితలంపై 0.3 మీటర్ల ఎత్తు ఉండేలా సిమెంట్ ప్లాట్‌ఫాం నిర్మించాలి.
► బోరుపై భాగంలో ఇనుప ప్లేటు లేదా బలమైన మూత బిగించాలి.
► మరమ్మతుల కోసం బోరు మూత తీసినా వెంటనే బిగించాలి.
► నీళ్లు పడని బోర్లను మట్టి, ఇసుక, రాళ్లతో భూ ఉపరితలం వరకు పూర్తిగా పూడ్చివేయాలి
► బోరు నిరుపయోగంగా ఉన్నా, నీరు పడకున్నా, నిరుపయోగమని అనుకున్నా సంబంధిత అధికారులకు తెలియజేసి, ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి.
► ప్రభుత్వ, ప్రైవేటు బోరువెల్స్ యంత్రాల నిర్వహకులు విధిగా జిల్లా అధికారుల వద్ద నమోదు చేసుకోవాలి.
► బోరు యజమాని, బోరు తవ్విన సంస్థ వివరాలు తెలుపుతూ బోరు బావి వద్ద బోర్డు ఏర్పాటు చేయాలి.
► గ్రామాల వారీగా బోర్ల స్థితికి సంబంధించిన సమాచారం సేకరించాలి. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శితో పాటు సంబంధిత శాఖలు ఈ బాధ్యత నిర్వర్తించాలి. పట్టణ ప్రాంతాల్లో ప్రజారోగ్య ఇంజనీరింగ్ లేదా పురపాలక, భూగర్భ జల శాఖలు ఈ బాధ్యత తీసుకోవాలి.