‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట | Hunting for financier to the Terrorists | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట

Published Thu, Jul 14 2016 2:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM

‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట

‘ఉగ్ర’ ఫైనాన్షియర్ల కోసం వేట

జేకేబీహెచ్‌కు భారీగా హవాలా నిధులు
- నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ బృందాల దర్యాప్తు
- హైదరాబాద్‌లో 13 చోట్ల పేలుళ్లకు కుట్ర
 
 సాక్షి, హైదరాబాద్ : సాధారణ పదార్థాలతో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఐసిస్ అనుబంధ సంస్థ ‘జుందుల్ ఖిలాఫత్ ఫీ బిలాద్ అల్ హింద్’ (జేకేబీహెచ్)కు ఆర్థిక సాయం చేసిన ఉగ్ర ఫైనాన్షియర్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దృష్టి పెట్టింది. వారికి అడ్డుకట్ట వేయకపోతే అదను చూసుకుని మరో మాడ్యూల్ ఏర్పాటు చేసే ప్రమాదముందని అనుమానిస్తోంది. అందుకే వీరిని గుర్తించేందుకు తమ కస్టడీలో ఉన్న నలుగురు ఉగ్రవాదుల్నీ లోతుగా విచారించాలని నిర్ణయించింది. ఈ మాడ్యూల్‌కు రాజస్థాన్‌లోని అజ్మీర్‌తో పాటు ఇతర ప్రాంతాల్లోని హవాలా ఏజెంట్ల ద్వారా నిధులందాయని గుర్తించింది. ఇవన్నీ ‘రియాల్’ కరెన్సీలో వచ్చాయని తేలింది.

సిరియాతో పాటు దుబాయ్ కోణమూ వెలుగులోకి వచ్చింది. సిరియాలో ఉన్న వీరి హ్యాండ్లర్ ద్వారానే సమాచార మార్పిడితో పాటు మౌలిక వసతుల కల్పన, ఆర్థిక సహకారం అందుతోందని ఇప్పటిదాకా భావించారు. కానీ వీరికి ఉగ్ర నిధులు రియాల్ రూపంలో రావడంతో దుబాయ్‌లోని ఉగ్ర ఫైనాన్షియర్లే హ్యాండ్లర్ ఆదేశానుసారం పంపి ఉంటారని ఎన్‌ఐఏ అనుమానిస్తోంది. హ్యాండ్లర్‌తో పాటు ఈ ఫైనాన్షియర్లనూ గుర్తించడం కీలకమనే భావనతో నిందితుల విచారణతో పాటు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టింది. ఈ ముష్కరులు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ విధ్వంసాలకు కుట్ర పన్నినట్లు ప్రాథమికంగా గుర్తించింది. ఆ వివరాలను నిందితులు పూర్తిగా బయటపెట్టడం లేదని అనుమానిస్తోంది. అందుకే అన్ని వివరాలూ రాబట్టడానికి నిందితుల్ని లోతుగా విచారించనుంది. 12 రోజుల పాటు విచారించినా వారు సహకరించనందున పూర్తి వివరాలు వెలుగులోకి రాలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. కస్టడీలో ఉన్న నలుగురు నిందితుల్ని వికారాబాద్, పోచంపల్లి, మేడ్చెల్, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకూ తీసుకెళ్లి ఆధారాలు సేకరించనున్నారు.

 ‘ఆన్‌లైన్’లో అప్రమత్తం
 ఆన్‌లైన్ వాడకంలో ముష్కరులు అనేక జాగ్రత్తలు తీసుకున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. ఎన్‌క్రిప్టెడ్ విధానంలో ఉండే ఈ-మెయిల్స్, డార్క్ వెబ్ వంటి అప్లికేషన్స్ వాడటంతో పాటు ఇబ్రహీం యజ్దానీ ద్వారా హ్యాండ్లర్‌తో సంప్రదింపులు జరిపారు. సమాచార మార్పిడికి ఇదే విధానాలతో పాటు సోషల్‌మీడియాను వాడారు. ఐసిస్ వీడియోలు, మెటీరియల్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు సొంత కంప్యూటర్లు కాకుండా సైబర్ కేఫ్‌లను వాడారు. ‘ఐసిస్’పై కన్నేసి ఉంచే నిఘా వర్గాలకు చిక్కే ప్రమాదాన్ని శంకించి ఈ జాగ్రత్త తీసుకున్నారు. ఆయా నెట్ సెంటర్లను గుర్తించి హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకోవడానికి ఎన్‌ఐఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

 13 ప్రాంతాల గుర్తింపు
 హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఈ మాడ్యూల్... పోలీసుస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రక్షణ రంగ సంస్థలనూ లక్ష్యం చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయాలను విదేశంలో ఉన్న హ్యాండ్లర్‌కు ముష్కరులు ఎప్పటికప్పుడు చేరవేశారు. వారిమధ్య ఫేస్‌బుక్, ఈ-మెయిల్‌తో పాటు ఇతర సోషల్ మీడియాల ద్వారా జరిగిన మార్పిడైన సమాచారాన్ని ఎన్‌ఐఏ సేకరించింది. నగరంలోని 13 ప్రాంతాలతో పాటు ఆరుగురు ప్రముఖులు వీరి హిట్‌లిస్ట్‌లో ఉన్నట్టు తేల్చింది. విధ్వంసాలు సృష్టించాలని వారు భావించిన ప్రాంతాలను అధికారికంగా గుర్తించారు. వారినుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విశ్లేషణ కోసం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, తుపాకులు, తూటాల్ని కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్‌ఎస్‌ఎల్), కేంద్రం ఆధీనంలోని సెర్ట్-ఇన్ సంస్థలకు పంపారు.  ఖలీఫాగా  ప్రకటించుకున్న ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బగ్దాదీకి బద్ధులమై ఉంటామంటూ ప్రమాణం చేయడానికి (బయాత్) వీరు వినియోగించిన పత్రాలను కూడా ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.
 
 కీలకాధారాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లు
 ఈ కేసులో నిందితులపై నేరం నిరూపించడానికి ఆధారాల సేకరణలో భాగంగా పలు ప్రాంతాల నుంచి భారీగా సీసీ కెమెరాల ఫుటేజ్‌లను ఎన్‌ఐఏ సేకరించింది. బాంబుల తయారీకి ముడి పదార్థాలు సమీకరించుకోవడానికి పలు దుకాణాల్లో, రెక్కీ కోసం పలు ప్రాంతాల్లో సంచరించారు. అప్పుడు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను అధికారులు సేకరించారు. వీటిని నిందితులతో పోల్చి చూడనున్నారు. ఇందుకు నిపుణుల సాయం తీసుకుంటున్నారు. వీరు షెల్టర్ తీసుకున్న, భేటీ అయిన, శిక్షణకు వినియోగించిన ప్రదేశాలకు వెళ్లి క్రైమ్ సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. వెలుగులోకి వచ్చిన అంశాల్లోని మిస్సింగ్ లింకులను పూరించుకోవడానికి కస్టడీలోకి తీసుకున్న నలుగురినీ విడిగా విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement