రోదిస్తున్న కుటుంబసభ్యులు, వెంకటేశ్ (ఫైల్)
హయత్‌నగర్: జనం చూస్తుడగానే దుండుగులు ఓ వ్యక్తిని వెంటాడి మరీ నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. స్థానికులు తేరుకొనేలోపే దుండగులు బైక్‌లపై పారిపోయారు. సోమవారం సాయంత్రం హయత్‌నగర్ ఠాణా పరిధిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం అంతంపేట గ్రామానికి చెందిన మద్ది వెంకటేశ్ అలియాస్ వెంకటయ్య (40) ఐదేళ్లుగా హయత్‌నగర్ మండలం మునుగనూరు గ్రామంలో ఉంటూ సొంతంగా డీసీఎం వ్యాన్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య యాదమ్మ, పిల్లలు మౌనిక, దీపిక, ఈశ్వర్ ఉన్నారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు వెంకటేశ్ బైక్ (ఏపీ29బీఎఫ్ 6818)పై వెళ్తుండగా మునుగనూరులోని బ్యాంక్‌కాలనీ బస్టాప్‌లో డిస్కవరీ బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు వెంకటేశ్‌ను అడ్డగించారు. గొడవకు దిగడంతో వెంకటేశ్ బైక్ వదిలి పరుగుతీశాడు. అతడిని వారు వెంబడించారు. జనం అంతా చూస్తుండగానే దుండగుల్లో ఇద్దరు తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు. అప్పటికే బైక్ స్టార్ట్ చేసి ఉన్న మూడో దుండగుడితో కలిసి పారిపోయారు. ఘటనా స్థలాన్ని ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు, ఇన్‌స్పెక్టర్ నరేందర్‌గౌడ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆస్తి తగాదాలే కారణం?
వెంకటేశ్ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. వెంకటేశ్‌కు అన్నదమ్ములతో ఆస్తి తగాదాలున్నట్టు సమాచారం. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కుటుంబ పెద్ద మృతి చెందడంతో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. వారి రోదన స్థానికులను కంటతడి పెట్టించింది.