భార్యను చంపిన భర్త
అదనపు కట్నం కోసం దారుణం
నేరేడ్‌మెట్: అదనపు కట్నం కోసం గొంతు నలిమి భార్యను హత్య చేశాడో కిరాతకుడు. నేరేడ్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎన్. చంద్రబాబు, స్థానికుల కథనం ప్రకారం....గౌతంనగర్‌లో నివాసముండే శ్రీకళ (26), శ్రీకాంత్ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2007లో పెళ్లి చేసుకున్నారు. వివాహ సమయంలో శ్రీకళ తల్లిదండ్రులు 10 తులాల బంగారు ఆభరణాలు, రూ. 2.5 లక్షల నగదు, ఇతర సామగ్రి ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. నాలుగు నెలలు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత కారు కొనుగోలు చేసి ట్రావెల్స్‌లో నడుపుతానని, రూ.2 లక్షలు అదనపు కట్నం కింద తేవాలని శ్రీకాంత్, తన తల్లి విజయ, సోదరుడు మధుతో కలిసి శ్రీకళను వేధించడం ప్రారంభించాడు.
దీంతో నాలుగు తులాల బంగారు ఆభరణాలు ఇచ్చారు. దానిని వారు అమ్ముకుని జల్సాలు చేసి తిరిగి డబ్బులు కావాలని శ్రీకళను మానసిక, శారీరక వేధింపులకు గురి చేస్తున్నారు. ఎంతగా వేధించినా ఆమె డబ్బులు తీసుకొని రాకపోవడంతో శ్రీకాంత్ తన తల్లి, సోదరుడితో కలిసి సోమవారం తెల్లవారుజామున శ్రీకళ గొంతు నులిమిహతమార్చాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి నీలం యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.