హైదరాబాద్ బ్రదర్స్ చెరోమాట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశంపై హైదరాబాద్‌కు చెందిన మంత్రులు దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్ పరస్పర భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే చాలా సమస్యలు వస్తాయని నాగేందర్ ఆందోళన వ్యక్తం చేయగా, హైదరాబాద్ జిల్లా రెవిన్యూ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగిస్తే అభ్యంతరం లేదని ముఖేష్‌గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ ఇరువురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మధ్యాహ్న విందు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ కూడా హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై దాదాపు గంటకుపైగా చర్చించారు. ప్రధానంగా హైదరాబాద్‌కు సంబంధించి శాంతిభద్రతలు, రెవెన్యూ వంటి అంశాలపై స్పష్టత లేదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో జరగబోయే చర్చ సందర్భంగా తాము ఈ అంశాలను లేవనెత్తి సవరణలు కోరతామని, అందుకు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపైనా నేతలు చర్చించారు.
హైదరాబాద్‌పైనే ఆంక్షలెందుకు?: దానం
‘హైదరాబాద్‌పై ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని మేము గతంలోనే కేంద్ర మంత్రివర్గ బృందం సభ్యులకు వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ దృష్టికి కూడా తీసుకొచ్చాం. అయినప్పటికీ హైదరాబాద్‌లోని శాంతిభద్రతలను గవర్నర్ చేతిలో పెట్టారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు హైదరాబాద్‌పైనే ఎందుకు? దీంతో చాలా సమస్యలు వస్తాయి.’
రెవెన్యూ పరిధిలో ఆంక్షలు ఓకే: ముఖేష్‌గౌడ్
‘హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో మాత్రమే శాంతిభద్రతల అంశాన్ని పరిమితం చేయాలి. ఆ మేరకు పోలీస్ యంత్రాంగాన్ని గవర్నర్ చేతిలో పెడితే అభ్యంతరం లేదు. అసెంబ్లీలో జరిగే చర్చ సందర్భంగా ఈ అంశంపై సవరణ కోరతాం. మద్దతివ్వాలని డిప్యూటీ సీఎంను కోరాం.’