
బీ ఇండిపెండెంట్..!
- సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు హైదరాబాదీల యత్నం
- గతేడాదిగా ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోలులో 25% పెరుగుదల
- శివారు ప్రాంతాల్లో తక్కువ బడ్జెట్ స్వతంత్ర ఇళ్లపై దృష్టి
- వాణిజ్య, వ్యాపార, ఉపాధి, విద్యా అవకాశాలు పెరగడమే కారణం
- ప్రాపర్టీ సెర్చ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్
అజయ్ ఓ ప్రైవేటు ఉద్యోగి. వేతనం రూ.35 వేలు. ప్రధాన నగరంలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్న అతను.. ఇటీవల శివారు ప్రాంతాల్లో సొంతిల్లు కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే అపార్ట్‌మెంట్ కంటే.. శివారు ప్రాంతాల్లో రూ.25 నుంచి రూ.28 లక్షల్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలుకే అతను మొగ్గు చూపుతున్నాడు. ఇది అజయ్ ఒక్కరి ఆలోచనే కాదు.. ఇటీవలి కాలంలో మధ్యతరగతి వేతనజీవులంతా దాదాపు స్వతంత్ర గృహాల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
రియాల్టీలో నయా ట్రెండ్..
రణగొణ ధ్వనులు లేని.. స్వచ్ఛమైన గాలి, వెలుతురు ఉండే ఆహ్లాదకర వాతావరణంలో సొంతిల్లు.. అదీ ఇండిపెండెంట్ హౌస్ కొనుగోలుకు గ్రేటర్ వాసులు ఇటీవల ఆసక్తి కనబరుస్తున్నారు. ఇరుకు గదులు.. అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న వారు సైతం.. శివారు ప్రాంతాల్లో స్వతంత్ర గృహాలైతేనే మేలన్న నిశ్చితాభిప్రాయానికి రావడం నగర రియాల్టీలో నయా ట్రెండ్‌గా మారింది. ఐటీ, బీపీవో, కేపీవో, ప్రైవేట్, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న వేతనజీవులు వారి స్తోమత, స్థాయిని బట్టి ఇంటి కొనుగోలుకు మక్కువ చూపుతున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
వీరు ప్రధాన నగరానికి 20–25 కి.మీ. దూరంలో ఉన్న శివారు ప్రాంతాల్లో స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఏడాదిగా ఈ రంగంలో 25 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రముఖ రియాల్టీ సైట్ మ్యాజిక్ బ్రిక్స్.. హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోలు విషయంలో కన్జ్యూమర్ సెర్చ్ ట్రెండ్స్‌పై తాజా అధ్యయనంలో తేలింది.
మహానగరంలో తాజా పరిస్థితి ఇదీ..
మహానగరం శరవేగంగా విస్తరిస్తుండటం.. శివార్లలో వాణిజ్య, వ్యాపార, ఉపాధి అవకాశాలు పెరగడం, కోర్ సిటీలో ధరలు ఆకాశాన్నంటడంతో వేతనజీవులు, మధ్యతరగతి ప్రజలు శివారు ప్రాంతాల్లో సొంతింటి కొనుగోలు యత్నాలు చేస్తున్నారు. దీంతో హయత్‌నగర్, అత్తాపూర్, మియాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో ఇటీవలికాలంలో స్వతంత్ర గృహాలు(ఇండిపెండెంట్), విల్లాల నిర్మాణం ఊపందుకుంది. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్ల ప్రాజెక్టులు 200 వరకు ఉన్నట్లు రియాల్టీ వర్గాలు చెపుతున్నాయి. వీటిల్లో సుమారు 25 వేల వరకు స్వతంత్ర గృహాలు నిర్మాణ దశలో ఉన్నాయని, ప్రధానంగా రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షలలోపు ధర పలికే ఇళ్లకు డిమాండ్ 25% పెరిగినట్లు తెలిపాయి.
బెంగళూరు కంటే ధరలు తక్కువే..
అభివృద్ధి, ఐటీ రంగంలో బెంగళూరు నగరంతో పోటీపడుతున్న గ్రేటర్ సిటీలో సొంతింటి ధరలు అక్క డితో పోలిస్తే 20% మేర తక్కువే. ఉదాహరణకు నగరంలో ప్రాంతాన్ని బట్టి, కల్పించే మౌలిక వసతులను బట్టి ప్రతి చదరపు అడుగు నిర్మాణ వైశాల్యానికి రూ.3 వేల నుంచి రూ.4 వేల ధర పలుకుతుండగా.. బెంగళూరులో రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతోందని బిల్డర్లు చెబుతున్నారు. దీంతో వేతనజీవులతోపాటు ఎన్‌ఆర్‌ఐలు నగరంలో గృహాలు, విల్లాల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. గృహరుణాలపై వడ్డీరేట్లు తగ్గించడం వల్ల కూడా వినియోగదారులు సొంతింటి ప్రయత్నాలు చేస్తున్నారని చెపుతున్నారు.
ట్రెండ్ ఇదీ..
సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గత ఏడాదిగా వివిధ సైట్లలో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఇలా ఉంది...
ఇంటి ధర జూలై 2016 జూలై 2017
రూ.25–80 లక్షలు 17,500 21,900
రూ.80 లక్షలు –రూ.1.50 కోట్లు 5,700 7,200
జీవించేందుకు అనువైన నగరం..
ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే జీవించేందుకు హైద రాబాద్ అత్యంత అనువైన నగరం. శివారు ప్రాంతాల్లో విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాలు పెరిగాయి. తాగునీరు, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు పెరగడంతో రియాల్టీ రంగం వేగంగా పురోగమిస్తోంది. ఇదే క్రమంలో సొంతింటి కల నిజం చేసుకునే వారికి తమ బడ్జెట్‌లోనే ఇళ్లు లభిస్తుండడంతో ఈ ట్రెండ్ పెరిగింది.
– రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు