ఖాట్మండులో రోడ్డుపైనే క్షతగాత్రులకు చికిత్స చేస్తున్న దృశ్యం
హైదరాబాద్/ఖాట్మండు: హైదరాబాద్ రామంతాపూర్కు చెందిన 28 మంది యాత్రికులు /ఖాట్మండులో చిక్కుకున్నారు. వారం రోజుల క్రితం వారు సాయిబాబా ట్రావెల్స్ ద్వారా ఖాట్మండ్ వెళ్లారు. భూకంపం సంభవించిన ప్రాంతానికి సమీపంలో వారు చిక్కుకున్నారు. హైదరాబాద్లో వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని తమవారిని హైదరాబాద్కు రప్పించాలని వారు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా వాసులు కూడా పలువురు ఖాట్మండ్‌లో చిక్కుకుపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన 20 మంది ఈ నెల 20వ తేదీన ఖాట్మండ్‌కు యాత్రకు వెళ్లారు. శనివారం ఉదయం కుటంబ సభ్యులతో యాత్రకు వెళ్లినవారు ఫోన్‌లో మాట్లాడారు. అయితే భూకంపం వార్త తెలిసిన తర్వాత ఇంటి నుంచి యాత్రకు వెళ్లిన వారికి ఫోన్‌లు చేయగా ఎలాంటి స్పందన లేదని యాత్రికుల బంధువులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ వారి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
అలాగే విజయవాడ నుంచి కూడా మరో 27 మంది ఖాట్మాండు ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం అందుతోంది. వాళ్లంతా ఏమయ్యారన్న విషయం తెలియడంలేదు. భూకంపం తాకిడికి ఖాట్మాండులోని విమానాశ్రయం మూసేశారు. దాంతో వాళ్లు అక్కడి నుంచి స్వదేశానికి వచ్చే మార్గం కూడా కనిపించడం లేదు.