
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, వైదేహి నగర్‌లో గురువారం తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో భూ ప్రకంపనలు వచ్చాయి. ఒక్క సెకండ్ పాటు భూమి కంపించి శబ్దాలు రావడంతో జనాలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ రోజు తెల్లవారుజామున అయిదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో భూ ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. బీఎన్‌రెడ్డి నగర్ కాలనీల్లో భూమి కంపించిన ప్రాంతంలో గతంలో ఎనరాళ్లు ఉండేవని చెబుతున్నారు. గంట గంటకు ఏమవుతుందో అని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు.