భూకంపాలు వచ్చేందు కు అవకాశం ఉండే ప్రాంతాలను సీస్మిక్ జోన్లుగా పేర్కొంటారు. భూమి లోపలి పొరల పరిస్థితి, వాటి మధ్య ఖాళీలు, పగుళ్లు, కదలికలు వచ్చే అవకాశం వంటి అంశా లను పరిశీలించి వీటిని.. ఎంత స్థాయిలో ప్రకంపనలు రావొచ్చనేది అంచనా వేస్తారు. ఆ తీవ్రతను బట్టి ఒకటి నుంచి ఐదు వరకు జోన్లుగా విభజిస్తారు. జోన్–1లో ఉంటే అత్యంత స్వల్ప స్థాయిలో... జోన్–5లో ఉంటే తీవ్ర స్థాయిలో తరచూ భూకంపాలు వచ్చే ప్రాంతం అని చెప్పవచ్చు.
రాష్ట్రంలో భూకంప జోన్లు ఇలా..
జోన్–1:
అతి స్వల్ప స్థాయిలో ప్రకంపనలకు అవకాశం ఉండే ప్రాంతాలు. ఇక్కడ ప్రకంపనలు వచ్చినా మనం గుర్తించలేనంత స్వల్పంగా ఉంటాయి.
జోన్–2:
ప్రకంపనల తీవ్రత 0.1 నుంచి నాలుగు పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, నిజామాబాద్, నల్లగొండతోపాటు ఏపీలోని కర్నూల్, నంద్యాల, అనంతపురం ప్రాంతాల వరకు జోన్–2లో ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రకంపనలతో దాదాపుగా ఎలాంటి నష్టం ఉండదు.
జోన్–3:
భూకంపాల తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 నుంచి 6 వరకు నమోదయ్యే అవకాశం ఉన్న ప్రాంతాలివి. మహారాష్ట్రలో చంద్రాపూర్ నుంచి మొదలై ఉత్తర తెలంగాణలో గోదావరి నది వెంట ఉన్న రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, బెల్లంపల్లి, భద్రాచలం, ఖమ్మంతోపాటు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలు, ఒంగోలు, నెల్లూరు తదతర ప్రాంతాలు జోన్–3 పరిధిలోకి వస్తాయి. దేశంలో చూస్తే పశ్చిమ తీర ప్రాంతాలు, గంగా, యమునా నది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడి భూకంపాలతో కొంత వరకు నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
జోన్–4:
భూప్రకంపనల తీవ్రత 6 నుంచి 7 పాయింట్ల వరకు ఉండే ప్రాంతాలివి. ముంబై సహా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, ఢిల్లీ వంటివి జోన్–4లో ఉన్నాయి. ఇక్కడ భారీ భూకంపాలు, తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది.
జోన్–5:
భూకంపాల తీవ్రత 7 పాయింట్లు, అంతకు మించి వచ్చే ప్రమాదమున్న ప్రాంతాలివి. హిమాలయ పర్వత ప్రాంతాలు, జమ్మూకశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్ రాష్ట్రంలోని కొంత భాగం దీని పరిధిలో ఉన్నాయి. ఇక్కడ వచ్చే భూకంపాలు అత్యంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment