హైదరాబాద్ టు కరీంనగర్
సిద్దిపేటకు చేరుకున్న అదనపు డీజీ రాజీవ్ త్రివేదీ సైకిల్ యాత్ర
హైదరాబాద్/సిద్దిపేట రూరల్: ఎప్పుడూ ఏదో ఒక సాహసానికి, సాహసయాత్రకు అంకురార్పణ చేసే రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, అదనపు డీజీ రాజీవ్ త్రివేది ఆదివారం సైకిల్ యాత్ర చేపట్టారు. ఈసారి ఆయన వెంట∙ఇద్దరు కుమారులు ప్రసూన్, ప్రశాంత్ సైతం బయలుదేరారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర సిద్దిపేట మీదుగా కరీంనగర్ వరకు 165 కిలోమీటర్లు సాగనుంది. ఈ యాత్ర దారిలోని పలు ప్రాంతాల్లో పోలీసు, విజిలెన్స్ అధికారులతో కలసి వ్యాపార, వాణిజ్య వర్గాలు, బ్యాంకర్లు ఇతర ఆఫీసర్లతో రాజీవ్ త్రివేది సమావేశాలు ఏర్పాటు చేశారు.
డిజిటల్ తెలంగాణ కావాలి: రాజీవ్ త్రివేదీ
రాష్ట్రాన్ని డిజిటల్ తెలంగాణగా మార్చి, దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపే యజ్ఞంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులు కావాలని డీజీ రాజీవ్ త్రివేది అన్నారు. హైదరాబాద్ నుంచి తమ కుమారులతో కలసి సైకిల్ తొక్కుతూ 100 కిలోమీటర్ల దూరంలోని సిద్దిపేటకు చేరుకున్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. డిజిటల్ తెలంగాణలో భాగంగా సీఎం కేసీఆర్ మొదట సిద్దిపేటను క్యాష్‌లెస్ నియోజకవర్గంగా మారుస్తున్నారనీ, ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.