
'ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తెలియదు కాబట్టి ఆ విషయంలో ఇప్పుడే స్పందించలేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చక్కదిద్దుతానని హమీనిచ్చారు.
శనివారం రాత్రి ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి నేతృత్వంలో మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, గంటా శ్రీనివాసరావు, పి. నారాయణ, రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాసరావు, పీతల సుజాత గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నవి తప్పకుండా అమలు చేయాలని కోరారు. గత ఏడాది కాలంలో వివిధ సందర్భాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు, వాటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన తీరుపై వివరించారు.
ఈ సందర్భంగా న్యాక్‌లో చందనాఖన్, శ్యాంబాబులను అవమానించారని, కార్మిక శాఖ అధికారుల పట్ల కఠినంగా వ్యవహరించారని, ఏపీ ఉన్నతవిద్యా మండలి ఫైళ్లను స్వాధీనం చేసుకుని ఇంత వరకూ ఇవ్వలేదంటూ పలు సందర్భాలను ఉటంకిస్తూ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీ ప్రజలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఏపీ సీఎంతో పాటు మంత్రుల పట్ల పరుష పదజాలం ఉపయోగిస్తున్నారని చెప్పారు. వీటిని వెంటనే నియంత్రించాల్సిందిగా కోరారు. తమ సీఎంతో పాటు మంత్రులు, ముఖ్యుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పారు.
దీనిపై గవర్నర్ స్పందిస్తూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని, మిగతా విషయాలపై తాను దృష్టి సారిస్తానని చెప్పారు. అవసరమైతే ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడతానని హామీనిచ్చారు. గవర్నర్‌తో భేటీ అనంతరం కేఈతో పాటు ఇతర మంత్రులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నా అంతిమంగా అమలు చేయాల్సింది గవర్నర్ కాబట్టి సెక్షన్ 8 తూచ తప్పకుండా అమలు చేయాల్సిందిగా కోరామన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని, తమ సీఎంతో పాటు మంత్రులను దూషించటం సరికాదన్నారు. ఏపీ ప్రజలంటే వ్యతిరేకతతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. సెక్షన్ ఎనిమిది ప్రకారం హైదరాబాద్‌లోని అందరి రక్షణ బాధ్యత గరవ్నర్‌దేనన్నారు.