ఓటమి భయంతోనే ట్యాపింగ్‌ డ్రామా | Tdp Taping drama with the fear of defeat | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే ట్యాపింగ్‌ డ్రామా

Published Sat, Apr 13 2024 5:02 AM | Last Updated on Sat, Apr 13 2024 5:02 AM

Tdp Taping drama with the fear of defeat - Sakshi

లోకేశ్‌ ఐ ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ టీడీపీ కొత్త నాటకం 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం 

అసలు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద ట్యాపింగ్‌ చేసే టెక్నాలజీనే లేదు 

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది 

ఫోన్‌ ట్యాపింగ్, ఓటర్ల డేటా చౌర్యంలో చంద్రబాబే సిద్ధహస్తుడు 

సాక్షి, అమరావతి: ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం తథ్యమని స్పష్టం కావడంతో చంద్రబాబు కోటరీ బెంబేలెత్తుతోంది. ప్రజల దృష్టిని మళ్లించేందుకు కొత్త పన్నాగాలు పన్నుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా ఫోన్‌ ట్యాపింగ్‌ కుట్రలకు పాల్పడిన చరిత్ర ఉన్న చంద్రబాబు తిరిగి అవే ఆరోపణలతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దు్రష్పచారం చేసేందుకు యత్నిస్తున్నారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్‌ ఐ ఫోన్‌ను ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ టీడీపీ ఎన్నికల కమిషన్‌ (ఈసీ)కి ఫిర్యాదు చేయడం ఆ కుట్రలో భాగమేనన్నది సుస్పష్టం.

వాస్తవం ఏమిటంటే అసలు ఫోన్లు ట్యాపింగ్‌ చేసే టెక్నాలజీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం వద్ద లేనే లేదు. ఈ విషయాన్ని కేంద్రం కూడా ఇటీవల స్పష్టంగా చెప్పింది. అసలు వాస్తవానికి వస్తే డాటా చోరీ, ఫోన్ల ట్యాపింగ్‌లో చంద్రబాబే సిద్ధహస్తుడు. ఇందుకోసం ఆయన సీఎంగా ఉండగా ఇజ్రాయెల్‌ నుంచి స్పైవేర్‌ 2019ను కొనుగోలు చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత ఆ రాష్ట్ర అసెంబ్లీలోనే వెల్లడించారు కూడా. 

భద్రతా చట్టాలను ఉల్లంఘించి పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్న చంద్రబాబు 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్‌ ట్యాపింగ్‌ జాడ్యానికి ఆద్యుడు చంద్రబాబే. 2004 ఎన్నికల్లో అప్పటి సీఎంగా ఉన్న ఆయన ప్రతిపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌ కోసం ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో ఆంధ్రప్రదేశ్‌కు సీఎం అయిన చంద్రబాబు మరోసారి ఫోన్‌ ట్యాపింగ్‌ అక్రమాలకు పాల్పడ్డారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

వైఎస్సార్‌సీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్‌తోపాటు ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడటం ఆ వ్యవస్థ లక్ష్యం. ఐటీ గ్రిడ్స్‌ అనే ప్రైవేటు కంపెనీ, అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు భాగస్వామిగా ఉన్న ఆకాశ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీల ద్వారా ఏరోస్టాట్‌ బెలూన్లు, ఇతర ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌తో సంప్రదింపులు జరిపారు. అందుకోసం ఏబీవీ బృందం ఇజ్రాయెల్‌లో పర్యటించింది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీ కంపెనీల నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనాలంటే కేంద్ర రక్షణ శాఖ అనుమతి తప్పనిసరి. జాతీయ భద్రత చట్టాన్ని సైతం చంద్రబాబు ప్రభుత్వం ఉల్లంఘించింది. రక్షణ శాఖకు సమాచారం ఇవ్వకుండానే ఐటీ గ్రిడ్స్‌ కంపెనీ ద్వారా ఫోన్‌ ట్యాపింగ్‌ పరికరాలు కొనుగోలు చేసి, వాటిని టీడీపీ కార్యాలయాల్లో పెట్టుకుంది.  

35 లక్షల మంది డేటా చౌర్యం 
అక్రమంగా కొన్న ఫోన్‌ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌తో చంద్రబాబు ప్రభుత్వం బరితెగించింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన 65 మంది నేతల ఫోన్ల ట్యాపింగ్‌కు పాల్పడింది. దీనిపై పూర్తి ఆధారాలతో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

2019 ఎన్నికలకు ముందు వివిధ కేసుల దర్యాప్తు ముసుగులో ఏకంగా వైఎస్సార్‌సీపీకి చెందిన 150 మంది ఫోన్లను ట్యాప్‌ చేయడం చంద్రబాబు దుర్మార్గ రాజకీయాలకు నిదర్శనం. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సాధికార సర్వే ద్వారా సేకరించిన ఓటర్ల సమాచారం మొత్తాన్ని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించిన సేవా మిత్ర యాప్‌నకు అనుసంధానించారు.

ఇలా రాష్ట్రంలోని ఓటర్ల వ్యక్తిగత సమాచారం చౌర్యానికి పాల్పడ్డారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్న 35 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ కుట్రకు వ్యతిరేకంగా అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేసింది. పోలీసులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు చేసింది. 

నిగ్గు తేల్చిన శాసన సభ ఉప సంఘం 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ ప్రభుత్వం చేసిన డేటా చౌర్యంపై విచారణకు శాసన సభ ఉప సంఘాన్ని నియమించింది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ హోం, ఆర్థిక, సమాచార–పౌర సంబంధాల శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులను విచారించింది.

అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతోనే తాము ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ సేవా మిత్ర యాప్‌నకు బదీలీ చేశామని ఆ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్‌ నుంచి ఫోన్‌ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ను అక్రమంగా కొన్న మాట వాస్తవమేనని, అందుకే ఆ దేశంలో పర్యటించామని తెలిపారు. ఈ వ్యవహారంపై శాసన సభా ఉప సంఘం మధ్యంతర నివేదికను కూడా శాసన సభకు సమరి్పంచింది. 

ఐ ఫోన్‌ను ట్యాప్‌ చేసే టెక్నాలజీ ఏపీ వద్ద లేదు 
ఫోన్ల ట్యాపింగ్‌ అంశంపై కేంద్ర హోమ్‌ శాఖ ఇటీవల కీలక ప్రకటన చేసింది. ఐ ఫోన్లను ట్యాప్‌ చేసే టెక్నాలజీ ఏపీ ప్రభుత్వం వద్ద లేదని తెలిపింది. ఆ టెక్నాలజీ కేంద్ర హోం, రక్షణ శాఖల వద్దే ఉంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, దేశ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అత్యున్నతస్థాయిలో ఆ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. మరి లోకేశ్‌ ఐ ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారని యాపిల్‌ కంపెనీ అలెర్ట్‌ మెస్సేజ్‌ పంపిందని టీడీపీ అంటోంది. అంటే లోకేశ్‌ ఫోన్‌ను ట్యాప్‌ చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

మరి కేంద్ర ప్రభుత్వాన్నిగానీ, బీజేపీనిగానీ ప్రశ్నించే ధైర్యం టీడీపీకి ఉందా? బీజేపీ నేతలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్న చంద్రబాబు ఆ సమయంలోనే వారిని లోకేశ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌పై నిలదీయవచ్చు. చంద్రబాబు అంత ధైర్యం చేయగలరా? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేస్తారా? లేకపోతే తాము వైఎస్సార్‌సీపీపై చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్తారా?  

చంద్రబాబు పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొన్నారు: మమతా బెనర్జీ 
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రూ.25 కోట్లు వెచ్చించి పెగసస్‌ నుంచి అక్రమంగా ఫోన్‌ ట్యాపింగ్, డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ కొన్నారని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రకటించడం జాతీయ స్థాయిలో పెను సంచలనం సృష్టించింది. 2022లో పశ్చిమ బెంగాల్‌ శాసన సభలో ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ డేటా చౌర్యం సాఫ్ట్‌వేర్‌ కొనాలని పెగసస్‌ కంపెనీ ప్రతినిధులు తనను సంప్రదించినా, తిరస్కరించినట్టు వెల్లడించారు.

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఆ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని, మీరు కూడా కొనాలంటూ ఆ సంస్థ ప్రతిపాదించిందని తెలిపారు. చట్ట విరుద్ధమైన ఆ పనిని తాను చేయలేనని తిరస్కరించానని ఆమె చెప్పారు. ఇవన్నీ చంద్రబాబు కుతంత్రాలను బయటపెట్టే వాస్తవాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement