
‘నా భర్త నాకు కావాలి’
హిమాయత్‌నగర్‌ః అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న నా భర్త నాకు కావాలని, విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదని భర్తపై ఓ భార్య పోరాటం చేస్తుంది. వివరాల్లోకి వెళితే బాగ్‌లింగంపల్లిలోని ఇడబ్ల్యూఎస్ క్వార్టర్‌స్‌కు చెందిన కారు డ్రైవర్ సత్యనారాయణతో 1996 సంవత్సరంలో తనకు వివాహం అయ్యిందని మొదటి భార్య ఎస్.రాజేశ్వరీ ఆదివారం విలేకరులకు తెలిపింది. ప్రస్తుతం మా పెళ్లికి సాక్షిగా 18ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడంది. 1997లో బాబు పుట్టిన సందర్భంలో ఎవరికి పుట్టాడో అని చెప్పి తనని ఇంటికి రాకుండా చేశాడని తెలిపింది.
అనంతరం కొద్ది రోజుల తరువాత విడాకులు ఇవ్వాలంటూ కోర్టు నోటీసులు పంపించాడన్నారు. నేను విడాకులకు నిరాకరించడంతో కోర్టు కూడా విడాకులను ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే 2002లో మౌనిక అనే యువతిని నాకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. మౌనిక వైపు బంధువులంతా తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణం ప్రభుత్వం స్పందించి తనకు న్యాయం చేసి భర్తను అప్పచెప్పాలని కోరుతున్నారు.