కెప్టెన్సీ విషయంలో నిరాశ చెందా
తనని ఎక్కువకాలం కొనసాగించలేదన్న సచిన్
న్యూఢిల్లీ: ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌కు కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవాలే ఉన్నాయి. అయితే తనను ఎక్కువ కాలం ఈ బాధ్యతలో కొనసాగించనందుకు తీవ్రంగా నిరాశ చెందానని మాస్టర్ చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా తన 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్ రెండు సార్లు జట్టు సారథిగా వ్యవహరించినా చెప్పుకోదగ్గ విజయాలు అందించలేకపోయాడు. తొలిసారిగా 1996లో కెప్టెన్ అయినా ఆ మరుసటి ఏడాదే ఉద్వాసనకు గురయ్యాడు. ‘నా దృష్టిలో క్రికెట్ అనేది టీమ్ వర్క్. కెప్టెన్ ఎప్పుడు బరిలోకి దిగాలి.. ఎలాంటి సూచనలు ఇవ్వాలనే కొన్ని దశలు ఉంటాయి. మైదానంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే అంతిమంగా బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంతో పాటు బౌలర్లు వికెట్లు తీయాల్సి ఉంటుంది. తొలిసారిగా బాధ్యతలు తీసుకున్న 12-13 నెలల అనంతరం నన్ను తీసేశారు. నన్ను నిరాశకు గురిచేసిన ఘటన అది. ఎందుకంటే కెప్టెన్ అనేవాడు జట్టును ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీనికి తగిన సమయం అవసరపడుతుంది. అలాకాకుంటే విజయాల రేటు జీరోగానే ఉంటుంది. అలాగే నా కెప్టెన్సీలో కఠినమైన పర్యటనలకు వెళ్లాం. మాకంటే చాలా మెరుగైన జట్లవి. నేను సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా లేకపోవడం మాత్రం చాలా నిరాశపరిచింది. ఇక రిటైర్ అయినందుకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు.
గతేడాది లార్డ్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడినప్పుడు బాగానే అనిపించింది. మర్నాడు మాత్రం క్రికెట్ నుంచి తప్పుకుని తెలివైన పని చేశావని నా శరీరం చెప్పినట్టనిపించింది’ అని ‘ఇండియా టుడే సదస్సు’లో పాల్గొన్న 41 ఏళ్ల సచిన్ చెప్పాడు. మరోవైపు ప్రస్తుత భారత జట్టు ప్రపంచకప్‌లో చాలా బాగా ఆడుతోందని, అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోందని అన్నాడు.