రాజ్యసభ రేసులో లేను
సీఎం కొనసాగించినంత కాలం మంత్రిగా ఉంటా: నాయిని
సాక్షి, హైదరాబాద్: తాను రాజ్యసభ సభ్యత్వానికి రేసులో లేనని.. పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నానని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మంలో ఈ నెల 27న జరిగే టీఆర్‌ఎస్ ఆవి ర్భావ దినోత్సవానికి సంబంధించిన సన్నాహాలపై సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘2014 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని కేసీఆర్ కోరినా.. కాదన్నాను. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని హామీ ఇచ్చి నెరవేర్చారు. ఆయన కొనసాగించినంత కాలం మంత్రిగా పనిచేస్తా’అని అన్నారు.
ఖమ్మం లో నిర్వహించనున్న టీఆర్‌ఎస్ 15వ వార్షికోత్సవాలకు హైదరాబాద్ నుంచి సుమారు 500 మంది ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. అలాగే ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని 27న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి భారీగా జన సమీకరణ చేస్తామన్నారు. పార్టీ మార్పిడి సంస్కృతిని కాంగ్రెస్ ప్రారంభించిందని.. గతంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నపుడు జానారెడ్డి ఎందుకు స్పం దించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులయ్యే ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ఖమ్మంలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై చర్చించి, తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈ నెల 27వ తేదీలోపు నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశముందన్నారు.