హోంమంత్రి పంచెలూడగొడతాం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయలేడు: దానం
హైదరాబాద్: హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పంచెలూడగొడతామని, సీఎం కేసీఆర్ ఏం చేయలేడని.. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అన్నారు. శనివారం హైదరాబాద్ అడిక్‌మెట్ లలితానగర్ కమ్యూనిటీ హాల్‌లో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌తో కలసి హాజరయ్యారు. దానం మాట్లాడుతూ... నాయిని గత ఎన్నికల్లో పోటీ చేయకుండా పారి పోయి ఇప్పుడు అల్లుడి కోసం గల్లీగల్లీ తిరుగుతున్నాడన్నారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, పోలీస్‌లకు ఫిర్యాదు చేస్తే ఇంత వరకూ అతీగతీ లేదని, హోంమంత్రి కనీసం పట్టించుకోవటం లేదని, రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఇలా ఉందని విమర్శించారు.
‘‘ప్రభుత్వాన్ని విమర్శించేవారిని బెదిరించి లొంగదీసుకోవాలనుకుంటున్నారు. ఎవరికీ బెదిరేది లేదు. పోలీస్ వారు కాదుకదా ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు’’ అంటూ దానం మండిపడ్డారు. ఒక కార్యకర్త మీద చేయిపడితే వంద చేతులు లేస్తాయని హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల పేర్లను వెల్లడించాలని, మసిబూసి మారేడుకాయ చేస్తే చీటింగ్ కేసుపెడుతామని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మక మని, ఏ చిన్న తప్పులు చేసినా టీఆర్‌ఎస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయలేమని తెలిపారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్, టి.శ్రీనివాస్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.