మజ్లిస్ మాకు మిత్రపక్షం: సీఎం
మజ్లిస్ పార్టీ తమకు మిత్రపక్షమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ అని తెలంగాణ భవన్ లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. ఎవరు ప్రధానంగా పోటీ ఇస్తారని భావిస్తున్నారన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వని కేసీఆర్.. ఆ తర్వాత వేరే సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకున్న మజ్లిస్ పార్టీ.. ఇప్పుడు టీఆర్ఎస్‌తో చేతులు కలుపుతుందన్న సంకేతాలను సీఎం సూచనప్రాయంగా ఇచ్చారు.
పేదలు ఆత్మగౌరవంతో బతకాలన్నది టీఆర్ఎస్ ఉద్దేశమని, అందుకే రూ. 40 వేల కోట్లను సంక్షేమ పథకాలకు కేటాయించామని అన్నారు. ఇప్ఉడు పరివ్రమలకు కూడా 24 గంటలు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు కంపెనీలలో విద్యుత్ కోతల వల్ల కార్మికులకు వారానికి రెండు రోజులు ఉపాధి ఉండేది కాదని, ఇప్పుడు తామిచ్చే కరెంటు వల్ల అలాంటి పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే నీళ్లు ఫ్రీగా ఇస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, అసలు వాటర్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటే.. ఒకవేళ వాళ్లు గెలిచినా అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరని సీఎం ప్రశ్నించారు.
ఆకతాయిల ఆగడాలకు షీ టీమ్స్‌తో చెక్ పెట్టామని, ఆటోరిక్షాలకు పన్ను రద్దు చేశామని, రూ. 30 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, లక్షల మంది పేదలకు పట్టాలిచ్చామని కేసీఆర్ చెప్పారు. భాగ్యనగరంలో మురుగునీరు పోగొట్టాలంటే రూ. 12 వేల కోట్లు ఖర్చుపెట్టాలని, దానికి సుమారు 3 ఏళ్ల కాలం పడుతుందని అన్నారు. ఈ దుస్థితి కాంగ్రెస్, టీడీపీల పుణ్యమా అనే నెలకొందని మండిపడ్డారు. డ్రైనేజి సిస్టం అంతా కాంగ్రెస్, టీడీపీల హయాంలో కబ్జాలలో కూరుకుపోయిందన్నారు.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు.. తాను లేవనెత్తిన అంశాలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉన్న ఏ రాష్ట్ర వాసైనా తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ తెలిపారు. చంద్రబాబు ఊడ్చడానికి ఆ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను ఆయన ఇంకేం ఊడ్చుతారని ఎద్దేవా చేశారు. బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 25 వేల కోట్లు తెచ్చి, హుస్సేన్‌సాగర్‌ను పరిశుభ్రం చేస్తామని తెలిపారు.