97.18 శాతం మందికి అర్హత | Icet results released | Sakshi
Sakshi News home page

97.18 శాతం మందికి అర్హత

Published Thu, Jun 1 2017 4:14 AM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM

97.18 శాతం మందికి అర్హత

97.18 శాతం మందికి అర్హత

ఐసెట్‌ ఫలితాలు విడుదల
- 25 వేల సీట్లు అందుబాటులో ఉండే అవకాశం
ఎంబీఏ కోసం 10 వేల మందికి పైగా బీటెక్‌ విద్యార్థుల నుంచి దరఖాస్తులు
ఈ నెల 4 నుంచి వెబ్‌సైట్‌లో ర్యాంకు కార్డుల డౌన్‌లోడ్‌కు అవకాశం  
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్‌–2017లో 97.18 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 77,422 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో 71,097 మంది పరీక్షకు హాజ రయ్యారు. వారిలో 69,091 మంది (97.18 శాతం) విద్యార్థులు అర్హత సాధించినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. మే 18వ తేదీన నిర్వహించిన ఐసెట్‌ ఫలితాలను ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో బుధవారం ఆయన విడుదల చేశారు. టాప్‌–10 ర్యాంకుల్లో మొత్తంగా తెలంగాణ విద్యార్థులే ఉన్నట్లు వెల్లడించారు.

టాప్‌–10లో 9 మంది బాలురు ఉండగా, ఒక్కరు బాలిక ఉన్నారు. వృత్తి విద్యా కోర్సులతోపాటు ఇతర డిగ్రీ కోర్సుల్లోనూ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయని పాపిరెడ్డి వెల్లడించారు. ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సెలింగ్‌ షెడ్యూలు జారీ చేస్తామన్నారు. ఈ ఐసెట్‌కు 40,610 మంది బాలురు హాజరు కాగా అందులో 39,486 మంది (97.23 శాతం) అర్హత సాధించారన్నారు. 30,487 మంది బాలికలు పరీక్షకు హాజరవగా 29,605 మంది (97.11 శాతం) అర్హత సాధించినట్లు వివరించారు. కాకతీయ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్, ఐసెట్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ సాయన్న మాట్లాడుతూ గత మూడేళ్లుగా కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐసెట్‌ను విజయవంతంగా నిర్వహించామన్నారు.

ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఓంప్రకాష్‌ మాట్లాడుతూ గత ఏడాది 283 ఎంబీఏ కాలేజీల్లో 28,174 సీట్లు అందుబాటులో ఉండగా, 52 ఎంసీఏ కాలేజీల్లో 2,336 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అందులో కన్వీనర్‌ కోటాలో 24,557 సీట్లు అందుబాటు ఉన్నాయని పేర్కొన్నారు. ఈసారి మొత్తంగా దాదాపు 25 వేలకు పైగా సీట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీల నుంచి కాలేజీల అనుబంధ గుర్తింపు వచ్చాక కచ్చితమైన సీట్ల సంఖ్య తెలుస్తుందన్నారు. గత ఏడాది ఐసెట్‌కు 72,442 దరఖాస్తు చేసుకోగా ఈసారి 77,422 మంది దరఖాస్తు చేశారని, గతంలో కంటే 5 వేల మంది పెరిగారని వివరించారు. విద్యార్థులు ఈ నెల 4వ తేదీ నుం చి ర్యాంకు కార్డులను   icet.tsche.ac.inవెబ్‌సైట్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్‌ చైర్మన్లు ప్రొఫెసర్‌ వెంకటాచలం, ప్రొఫెసర్‌ మల్లేశ్, కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
పరీక్షకు హాజరైన బీటెక్‌ విద్యార్థులు
ఈసారి ఐసెట్‌ రాసేందుకు 10 వేల మందికి పైగా బీటెక్‌ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేయడం విశేషం. వారిలో బాలురు 6,203 మంది ఉండగా, 4,182 బాలికలు ఉన్నారు. వారిలో 5,157 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 5,126 మంది అర్హత సాధించారు. బాలికలు 3,618 మంది పరీక్షకు హాజరు కాగా 3,596 మంది అర్హత సాధించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement